Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొలాలు తడపని ప్రాజెక్టులెందుకు ?
- పాలమూరు-రంగారెడ్డి
- ఊసెత్తని సీఎం
- ఉద్యోగాల కల్పన అంతంతే..
- సీపీఐ(ఎం) మహబూబ్నగర్ జిల్లా 19వ మహాసభలో తమ్మినేని
నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఏడాదిపాటు సాగిన ఉద్యమం మరో స్వాతంత్య్ర పోరాటాన్ని తలపించిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వారి స్ఫూర్తితో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాలులో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.రాములు అధ్యక్షతన శనివారం ప్రారంభమైన పార్టీ 19వ జిల్లా మహాసభలో తమ్మినేని ప్రారంభోపన్యాసం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియంత పోకడలకు చరమగీతం పాడుతూ రైతులు చేపట్టిన ఉద్యమానికి మోడీ తలవంచక తప్పలేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాఉద్యమ పరిణామాలను చూస్తుంటే ఎర్రజెండాకు తిరుగులేని ఆదరణ లభిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 374 రోజుల ఉద్యమం, 705 మంది రైతుల ప్రాణ త్యాగాల ఫలితమే నల్ల చట్టాల రద్దన్నారు. ప్రధాని మోడీ కార్మిక చట్టాలను కుదించి నాలుగు కోడ్లుగా మార్చి 150 ఏండ్ల నాటి విధానాలను ముందుకు తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి రద్దు కోసం ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. 8 గంటల పని దినాల కోసం పుట్టిందే ఎర్రజెండా అని గుర్తు చేశారు. లౌకిక దేశమైన భారత్లో ముస్లింలు దేశం విడిచి వెళ్లేలా కేంద్రం సీఐఏ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రశ్నించిన వారిని దేశద్రోహం పేరుతో జైలుకు పంపే కుట్రలకు పాల్పడుతోందన్నారు.విమానయానం, ఎల్ఐసీ, షీప్యార్డు, బీఎస్ఎన్ఎల్, రైల్వే వంటి కీలక రంగాలను ప్రయివేటుపరం చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం మాదిరగా మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీ విధానాలకు వత్తాసు పలుకుతున్నారన్నారు. రైతు వ్యతిరేక చట్టాల విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబించారని గుర్తుచేశారు. కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్, కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా సీఎం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేంద్రం విషయంలో ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేసే పోరాటాల్లో కలిసి రావాలని కోరారు. డిల్లీలో యుద్ధం చేస్తామన్న కేసీఆర్ మోడీ ముందుకెళ్లగానే ఎందుకు తోక ముడిచారని ప్రశ్నించారు. రాష్ట్రం వస్తే 1.91 లక్షల ఉద్యోగాలొస్తాయన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయన్నారు. ఒకసారి 30 వేల ఉద్యోగాలిస్తామని, మరోసారి అసలు ఖాళీలే లేవంటూ.. పూటకో మాట అనడం అయనకే చెల్లిందన్నారు. పొలాలు తడపని ప్రాజెక్టులెందుకని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ఊసే ఎత్తడం లేదన్నారు.
ప్రపంచంలోనే అగ్రదేశమైన అమెరికాకు దీటుగా కమ్యూనిస్టు దేశమైన చైనా ఎదగడం ఆహ్వానించదగ్గ పరిణామన్నారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయం నుంచి రాయల్ ఫంక్షన్ హాలు వరకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. మహాసభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, నంద్యాల నర్సింహారెడ్డి, ఆహ్వాన సంఘం నాయకులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి దంపతులు, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కిల్లే గోపాల్, ఆర్.వెంకట్రాములు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఖమర్ అలీ పాల్గొన్నారు.