Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనవరి 20న మరోసారి కార్మిక సంఘాలతో భేటీ
- ఆర్ఎల్సీ నిర్ణయం
- నేటి నుంచి విధుల్లోకి సింగరేణి కార్మికులు..
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కార్మికుల చర్చలు అసంపూర్తిగా ముగిసాయి. మూడు రోజులుగా కార్మికశాఖ ప్రాంతీయ కమిషనర్ (ఆర్ఎల్సీ) తో సింగరేణి కార్మికసంఘాలు చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. కార్మిక సంఘాల డిమాండ్లపై జనవరి 20న మరోసారి సమావేశమై చర్చించాలని ఆర్ఎల్సీ నిర్ణయించింది. దీనికి సంఘాలు కూడా అంగీకరించాయి. సింగరేణి కార్మికుల మూడు రోజలు సమ్మెను విరమించి ఆదివారం ఉదయం షిఫ్టు నుంచి విధుల్లోకి వెళ్లేందుకు అంగీకారం కుదిరినట్టు సింగరేణి యాజమాన్యం తెలిపింది. రాష్ట్రానికి చెందిన నాలుగు బొగ్గు బ్లాక్‌లను(జేవీఆర్ ఓసీ-3, శ్రావణపల్లి, కోయగూడెం బ్లాక్-3, కేకే-6 ఇంక్లైన్) వేలం వేయరాదన్న ప్రధాన డిమాండ్‌తో సింగరేణి లోని కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై హైదరాబాద్‌లోని రీజినల్ లేబర్ కమిషనర్ వద్ద జరుగుతున్న చర్చలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. బొగ్గు బ్లాకుల్ని వేలం నుంచి తొలగించి వాటిని సింగరేణికే అప్పగించాలన్న అంశం కేంద్ర ప్రభుత్వ విధానపర నిర్ణయం కాబట్టి, అది అక్కడే పరిష్కారమవుతుందని యాజమాన్యం చర్చల్లో తెలిపింది. కార్మిక సంఘాలుగా తాము ఢిల్లీ వెళ్లి ఈ అంశంపై సంబంధిత శాఖ మంత్రిని, ఇతరులను కలిసి నివేదిస్తామని కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. దానికి తాము కూడా సహకరిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మిగతా డిమాండ్లను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కేంద్ర కార్మిక శాఖ అధికారులు ఇరు పక్షాలకు సూచించారు. దీనిపై జనవరి 20న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. అనంతరం మూడు రోజుల పాటు కొనసాగిన సమ్మె శనివారం రాత్రి షిఫ్టు తో ముగుస్తుంది కాబట్టి ఆదివారం నుంచి కార్మికులందరూ తిరిగి విధులకు హాజరుకావాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. బొగ్గు బ్లాక్‌లను వేలంలో పెట్టకుండా సింగరేణి సంస్థకే అప్పగించాలని పేర్కొంటూ తాము స్వయంగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు పదికి పైగా లేఖలు రాశామనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రధాన మంత్రికి లేఖ రాసారని గుర్తుచేశారు. సింగరేణిలో మూడు రోజుల సమ్మె వల్ల రూ.120 కోట్ల నష్టం జరిగిందని యాజమాన్యం తెలిపింది.