Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడ్రోజులు విధులకు కార్మికులు దూరం
- మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలు
- నిలిచిన 6లక్షల టన్నుల ఉత్పత్తి
- సమ్మె జయప్రదంపై కార్మిక సంఘాల కృతజ్ఞతలు
నవతెలంగాణ- విలేకరులు
బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ సింగరేణి కార్మికులు చేపట్టిన మూడ్రోజుల సమ్మె శనివారంతో దిగ్విజయంగా ముగిసింది. 72 గంటలపాటు సంపూర్ణంగా జరిగింది. సింగరేణి సంస్థ విస్తరించిన ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని 26 భూగర్భ గనులు, 19 ఓసీపీ గనుల్లో కార్మికులు పూర్తిగా సమ్మెలో పాల్గొన్నారు. సింగరేణి వ్యాప్తంగా 42 వేల మంది కార్మికులు విధులకు గైర్హాజరయ్యారు. సుమారు ఆరు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సంస్థ భవిష్యత్ అంధకారంలోకి నెట్టివేయబడు తుందనే విషయాన్ని గ్రహించిన కార్మికులు స్వచ్చంధంగా సమ్మెలో పాల్గొన్నారు. కార్మికులకు, ఆయా సంఘాల నాయకులకు జేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో జాతీయ రహదారిపై కార్మికుల నిరసనకు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మద్దతు తెలిపారు. కార్మికులనుద్దేశించి మాట్లాడారు. సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు తెలిపిందని, కార్మికులకు ఎలాంటి నష్టం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. బొగ్గు బ్లాకులను సింగరేణికే అప్పగించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. కాసిపేట 1గనిపై సమ్మెకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, డికొండ అన్నయ్య, ఏనుగు రవీందర్ రెడ్డి, వెంగళ కుమారస్వామి, వీరభద్రయ్య, ఏఐటీయూసీ నాయకులు ముస్కె సమ్మయ్య, బాజీసైదా, కొట్టె కిషన్‌రావు, సీఐటీయూ నాయకులు రామగిరి రామస్వామి, మిడివెల్లి శంకర్, భాగ్యరాజ్, హెచ్ఎంఎస్ నాయకులు జీవన్ జోయల్, తిప్పారపు సారయ్య, అనిల్ రెడ్డి, ఐఎన్టీయూసీ నాయకులు జి.రామస్వామి, కె.తిరుపతి, సొమ్ము రాజయ్య, నడిపెల్లి ట్రస్ట్ చైర్మెన్ విజిత్‌రావు పాల్గొన్నారు.
రామగుండం రీజియన్‌లోని ఆరు భూగర్భ గనుల్లో నుంచి ఒక్క బొగ్గు పెళ్ల కూడా బయటకు రాలేదు. ఓసీపీ -1, ఓసీపీ-3 గనుల నుంచి స్వల్పంగా బొగ్గు ఉత్పత్తి జరిగింది. బండ మట్టి తొలగించడానికి యాజమాన్యం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కార్మికులను ఫోన్ల చేసి రప్పించి పనులు చేయించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సమ్మె విజయవంతానికి బొగ్గు గనులపై ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. బొగ్గు గనుల ప్రయివేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధంగా ఉండాలని సీఐటీయూ అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు.
రామగిరి మండలంలోని ఆర్జీ-3లో ఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మద్దతు తెలిపారు. సింగరేణి కార్మికుల సమ్మెకు మద్దతుగా మంథనిలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. గోదావరిఖనిలో విప్లవ కార్మిక సంఘాల నాయకులు రాస్తారోకో చేశారు. ప్రధాన చౌరస్తాలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.
కొత్తగూడెం ఏరియాలోని గనులు, ఉపరితల విభాగాల్లో ఏఐటీయుసీ, సీఐటీయు, ఐఎన్టీయుసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్, ఇఫ్య్టూ అనుబంధ సింగరేణి కార్మిక సంఘాలు, టీబీజీకెఎస్, బీఏపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నాలు చేపట్టారు. సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం వంటావార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయం ముందు కార్మికులు బైటాయించారు. అధికారులను, ఉద్యోగనులు ఎవరినీ కార్యాలయంలోకి అనుమతించలేదు. ధర్నానుద్దేశించి కార్మిక సంఘాల జేఏసి నాయకులు మాట్లాడారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కోల్‌బెల్ట్ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మణుగూరు, ఇల్లందు, టేకులపల్లి, సత్తుపల్లిలో ఓసీల్లో కార్మికులు విధులు బహిష్కరించారు. సీపీఐ(ఎం), సీపీఐ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీజీకెఎస్ నాయకులు ఎం.డి.రజాక్, కాపు కృష్ణ, ఏఐటీయూసీ నాయకులు జి.వీరస్వామి, గట్టయ్య, ఐఎన్టీయుసీ నాయకులు కాలం నాగభూషణం, వెంకటస్వామి, హెచ్ఎంఎస్ నాయకులు ఆంజనేయులు, సీఐటీయు నాయకులు విజయగిరి శ్రీనివాస్, కర్ల వీరస్వామి, శ్రీరాంమూర్తి, బిఎంఎస్ నాయకులు మాధవ నాయక్ పాల్గొన్నారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సింగరేణి కార్మికుల సమ్మెకు వ్యాపారస్తులు స్వచ్చంధంగా బంద్ పాటించి మద్దతిచ్చారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.