Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయోత్సవంలో ఏఐకేఎస్‌సీసీ నేతలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టకుండా చూడటంలో అప్రమత్తంగా ఉంటూనే, కనీస మద్దతు ధరల చట్టాన్ని సాధించాలని ఏఐకేఎస్‌సీసీ పిలుపునిచ్చింది. ఏడాదిపాటు కొనసాగిన రైతాంగ ఉద్యమం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందనీ, దీంతో ఆందోళన చెందిన కేంద్రం దిగిరాక తప్పలేదని పేర్కొంది. మోడీ సర్కారు పార్లమెంటులో సాగు చట్టాల ఉపసంహరించుకోవడమేకాకుండా, రాతపూర్వకంగా హామీ ఇచ్చిన నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద అఖిలభారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చారు. బెలూన్లు పైకి ఎగురువేశారు. స్వీట్లు పంచుకున్నారు. అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. వారి స్ఫూర్తిని కొనసాగిస్తామంటూ నినదించారు. సాగు చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన వాగ్ద్ధానాల అమలు కోసం ఉద్యమించాలని ప్రతినబూనారు. ఈ సందర్భంగా ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు పి జంగారెడ్డి మాట్లాడుతూ రైతాంగ పోరాటానికి తలొగ్గి కేంద్రం సాగు చట్టాలను వెనక్కి తీసుకుందని తెలిపారు. కనీస మద్దతు ధరల చట్టాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. అమరవీరుల కుటుంబాలకు పరిహారం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రుణవిమోచన, కనీస మద్దతు ధరల బిల్లులను పార్లమెంటులో ప్రయివేటుగా ప్రవేశ పెట్టారనీ, వాటిని ఆమోదించాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యలు లేని భారతం కావాలని ఆకాంక్షించారు. 2018లో ప్రారంభమైన రైతాంగ ఉద్యమం ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. ఉద్యమ విచ్ఛిన్నానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ చేసిన కుట్రలు ఫలించలేదన్నారు.వ్యవసాయ రంగాన్ని రక్షించాలంటూ కొంత మంది మేధావులు ఆత్మహత్యల చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ మాట్లాడుతూ రైతాంగ ఉద్యమం...నిరంకుశ బీజేపీ ప్రభుత్వం మెడలు వంచిందన్నారు. కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చే దోపిడీ విధానాలను మట్టి మనుషులు తిప్పికొట్టారని చెప్పారు. ఎమ్ఎస్పీ చట్టం ద్వారానే వ్యవసాయరంగం అభివృద్ధి చెందుతుందన్నారు. ఏఐకేఎస్‌సీసీ జాతీయ నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ సాగు చట్టాలను వెనక్కి కొట్టడమనేది ఒక చారిత్రాత్మక విజయమన్నారు. 'మోడీ మారడు. ఆయనపై విజయం సాధించలేరు' అనే పరిస్థితిని రైతు ఉద్యమం మార్చివేసిందని వివరించారు. రైతు స్వరాజ్యవేదిక నాయకులు కన్నెగంటి రవి, విస్సా కిరణ్ మాట్లాడుతూ రైతాంగ ఉద్యమంలో మహిళా రైతులు, ఆదివాసీలు, గిరిజనులు, సన్న,చిన్నకారు రైతులు సైతం వేల సంఖ్యలో పాల్గొన్నారని చెప్పారు. సంపూర్ణ విజయం దిశగా ఉద్యమాలు సాగించాలని పిలుపునిచ్చారు. సంఘాలు విడివిడిగా కాకుండా ఐక్యఉద్యమాలు నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌శోభన్, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు వై సోమన్న, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం, ఏఐకేఎఫ్ సభ్యులు తుకారం నాయక్, ఏఐకేఎంస్ నేత చలపతిరావు, రాంచం ద్రయ్య, నాయ కులు సీహెచ్ మురహరి, మీరా సంఘమిత్ర, ఝాన్సీ(పీవోడబ్ల్యు), ఎస్ఎల్ పద్మ, కె రమ, అరుణ, కిరణ్, మహేష్, నాగేశ్వరరావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.