Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో క్యాథ్‌ల్యాబ్ పున: ప్రారంభం
- కోవిడ్ టైమ్‌లో గాంధీ సేవలు మరువలేనివి..
- ఒమిక్రాన్‌పై ఆందోళన అవసరం లేదు : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
- గాంధీ ఆస్పత్రిలో సిటీస్కాన్ యూనిట్ ప్రారంభం
నవతెలంగాణ-బేగంపేట్
గాంధీ ఆస్పత్రిలో మరో 200 పడకలను అందుబాటులోకి తెస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కొవిడ్ సమయంలో గాంధీ ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది అందించిన సేవలు ఎన్నిటికీ మరువలేనివని చెప్పారు. బతుకుతామో లేదోననన్న ఆందోళన నెలకొన్న సమయంలో ఎంతో మందికి ప్రాణం పోశారని, ఆపద సమయంలో ప్రభుత్వాస్పత్రులే ఆదుకుంటాయన్న భరోసా కల్పించారని అన్నారు. శనివారం మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలతో కూడిన సిటీస్కాన్ యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సమయంలో దాదాపు 84 వేల మందికి పైగా గాంధీలో సేవలు అందించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21 సిటీస్కాన్ యూనిట్లను మంజూరు చేశామన్నారు. ఆస్పత్రికి పేషెంట్ల సంఖ్య ఎక్కువగానే ఉంటోందన్నారు. ముఖ్యంగా గాంధీలో ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నాయని, త్వరలో మరో 200 పడకలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రెండేండ్ల నుంచి ఆస్పత్రిలోని క్యాథ్ ల్యాబ్ పనిచేయపోవడంపై అధికారులతో మాట్లాడానని, త్వరలో ల్యాబ్‌ని పున్ణప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొవిడ్ రూల్స్ మాత్రం అందరూ పాటించాలని, మాస్కు వాడాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో మాత్రమే 15 మందికి కరోనా పాజిటివ్ తేలిందన్నారు. వీరిలో 13 మందికి సంబంధించి ఒమిక్రాన్ నెగెటివ్ రిపోర్టు వచ్చిందన్నారు. మరో ఇద్దరి ఫలితాలు రావాల్సి ఉందన్నారు. అనంతరం మంత్రులు అధికారులతో కలిసి గాంధీ ఆస్పత్రిలోని వివిధ వార్డులను పరిశీలించారు. పేషెంట్లతో మాట్లాడి వైద్యం ఎలా అందుతుందని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వాస్పత్రులకు మంచి పేరు తేవాలని డాక్టర్లకు, వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తదితరులు పాల్గొన్నారు.