Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంతాపసభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీల నాన్ టీచింగ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు భగత్ సింహ ఆశయాలను కొనసాగించాల్సిన అవసరముందని పలువురు వక్తలు కొనియాడారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ అధ్యక్షతన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, కార్యదర్శి పాలడుగు భాస్కర్, ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజెస్ నాన్ టీచింగ్ ఫెడరేషన్ అధ్యక్షులు తన్వీర్, యూనియన్ నాయకులు సుబ్బారావు భగత్ సింహ సోదరుడు రాజశేఖర్, సోదరి రుద్రమదేవితో పాటు సీఐటీయూ ఏపీ కోశాధికారి ఏ.వి.నాగేశ్వర రావు, సీఐటీయూ నేత పి.రాజారావు తదితరులు పాల్గొని భగత్ సింహకు నివాళులర్పించారు. భగత్ సింహ మరణానికి సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సమస్యలపై పోరాటమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అవుతుందని వ్యాఖ్యానించారు. వీరయ్య మాట్లాడుతూ ''భగత్ సింహ పట్టుదల గల వ్యక్తి. జీవితాంతం వరకు అనుకున్న దాని కొరకు నిలబడ్డ వ్యక్తి. బోధనేతర సిబ్బందితో పాటు బోధనా సిబ్బంది, ఇతరుల సమస్యలపై కూడా ఆవేదన చెందేవాడు. బోధనేతర సిబ్బంది, బోధనా సిబ్బంది మధ్య అనుసంధానం కుదిర్చేందుకు ప్రయత్నించారని కొనియాడారు. అనంతరం ఆయా కాలేజీల నుంచి వచ్చిన బోధనేతర సిబ్బంది నాయకులు భగత్ సింహతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆశయాల సాధన కోసం మరింత పటిష్టంగా ముందుకెళతాం ''అని ప్రకటించారు. ఆ నాయకుల్లో కె.వేణుగోపాల్, నందగోపాల్, సుధాకర్,రాములు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా సింహ సోదరి రుద్రమదేవి, సోదరుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. భగత్ మేనబావ మాట్లాడుతూ, యాదాద్రి-భువనగిరి జిల్లా ఐఎప్టీయూ పక్షానా నివాళి తెలిపారు.