Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగుల సీనియారిటీ జాబితాను నిర్దేశించుకున్న సమయంలోపు, పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎస్ వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే ప్రక్రియను పూర్తి చేసిన ఉమ్మడి జిల్లాలు రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల కలెక్టర్లను అభినందించారు. హైదరాబాద్ మినహా మిగిలిన ఐదు ఉమ్మడి జిల్లాలు కూడా ఉద్యోగుల ప్రాధాన్యతల ఆధారంగా సీనియారిటీ జాబితాను రూపొందించాలని ఆదేశించారు. ప్రతి ఉద్యోగి కేటాయింపును పూర్తి చేయాలని సూచించారు. ఇతర శాఖల్లో డిప్యూటేషన్‌లో ఉన్న ఉద్యోగులను వారి మాతృశాఖ పరిధిలో చూపించాలని కోరారు. సజావుగా ప్రక్రియ పూర్తి చేసేందుకు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సాధారణ పరిపాలనాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.