Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గీతం విద్యార్థులతో ముఖాముఖిలో కేరళ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ రాజు
- నిరంతర పరిశోధనలతో అపరిమితం కానున్న కంప్యూటర్ సామర్థ్యం
నవతెలంగాణ -పటాన్ చెరు
అవసరం ఆధారిత, దురాశతో కూడిన అవినీతి క్రమంగా పెచ్చరిల్లుతూ దేశ నైతికతనే దెబ్బతీస్తోందనీ, దాన్ని అదుపు చేయగలిగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని కేరళ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, 1991 ఐఏఎస్ బ్యాచ్ టాపర్, ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి డాక్టర్ రాజు నారాయణ స్వామి అన్నారు. మంగళవారం గీతం డీమ్డ్ యూనివర్సిటీలోని సీఎస్ఈ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. గీతం విద్యార్థి విభాగాలు దిశ, సీఎస్ఐలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 'కంప్యూటర్ సైన్స్, కొత్త సరిహద్దులు, విహంగ వీక్షణం' అంశంపై ఆయన ప్రసంగించారు. విద్య.. అక్షరాభ్యాసంతో ప్రారంభం కాదనీ, తల్లి చూపు, తండ్రి పరిశీలనతో మొదలవుతుందని తెలిపారు. అక్షరాస్యత.. విద్య ముగింపో, ప్రారంభమో కాదనీ, విద్య.. మానవతావాదం, ఆలోచనల సాహసం, సత్యాన్వేషణ కోసం జరగాలనీ, అంతిమంగా విద్య ఒకరిని మంచి మనిషిగా తీర్చిదిద్దాలని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. నిరంతర పరిశోధనలతో కంప్యూటర్ సామర్థ్యాన్ని అపరిమితంగా పెంచుతున్నారనీ, ఫజ్జీ లాజిక్ ద్వారా ఒకనాటికి అందాల పోటీల్లో కంప్యూటరే న్యాయనిర్ణేత కాగలదని జోస్యం చెప్పారు. అంతరిక్ష పరిశోధనా సంస్థ విజన్ 2075ని ఉటంకిస్తూ, ఆకాశంలో రెండు లక్షల కిలోమీటర్ల ఎత్తున అంతరిక్ష కాలనీలు వస్తాయనీ, జియో శాటిలైన్ స్టేషన్కు లిఫ్టులో అక్కడి నుంచి రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళేలా పరిశోధనలు సాగుతున్నాయన్నారు. పనిని అంకితభావంతో చేస్తేనే అది విజయవంతమవుతుందనీ, స్వేదం చిందించకుండా విలువైనవేవీ మనకు దక్కవనీ, విజయ స్ఫూర్తితో ముందుకు సాగుతూ.. ఘనమైన నాగరికతకు వారసులమని గుర్తించాలని తెలిపారు. అప్పుడే మనల్ని ఏ శక్తీ అడ్డుకోలేదని విద్యార్థుల హర్షధ్వానాల మధ్య సర్ సీ.వీ.రామన్ను ఉటంకిస్తూ వెల్లడించారు. తొలుత, గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య ఆయన్ను ఘనంగా సత్కరించారు. ముఖాముఖిలో సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్, ప్రొఫెసర్ పి.ఈశ్వరయ్య, డాక్టర్ జోసెఫ్ జయకర్, డాక్టర్ పి.నరసింహస్వామి, సీఎస్ఐ సమన్వయకర్త ఎం.కిరణ్ శాస్త్రితో పాటు పలువురు గీతం విద్యార్థులు పాల్గొన్నారు.