Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన రైతు
నవతెలంగాణ-చండ్రుగొండ
తనకు న్యాయం చేయాలంటూ పెట్రోల్ పోసుకొని యువరైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాల్య తండాకు చెందిన యువ రైతులు భూక్య రాధాకృష్ణ, భూక్య జయకృష్ణలకు చెందిన ఉమ్మడి కుటుంబం భూమిలో బోరు బావి ఉన్నది. తన పక్కనే గల ప్రత్యర్థి భూక్య రామదాసు భూమిలో కొద్ది నెలల కిందట బోరు వేయగా తన బోరు బావిలో నీరు తగ్గి పోయి ఎండిపోయే పరిస్థితి నెలకొందని స్థానిక తహసీల్దార్ ఎం.ఉష శారద, జిల్లా కలెక్టర్ అనుదీప్‌కు సైతం పలు మార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇటీవల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహశీల్దార్ ఇరువర్గాలకు చెందిన భూక్య రాధాకృష్ణ, భూక్య జయకృష్ణ, భూక్య రాందాస్, భూక్య రాజేష్, భూక్య దేవిల బోరు బావుల విద్యుత్ కలెక్షన్లు తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి కరెంటు సరఫరా నిలుపుదల చేయించారు. ఈ క్రమంలో భూక్య రాందాస్ అనధికారికంగా ఓ మోటర్‌కు కరెంట్ సరఫరా తీసుకొని వ్యవసాయ అవసరాలకు వాడుకుంటున్నాడని భూక్య రాధాకృష్ణ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అయినా పట్టించుకోవడం లేదని మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి పెట్రోల్ బాటిల్‌తో వెళ్లిన రామకృష్ణ, తహసీల్దార్ ఎం.ఉషా శారద ఎదుట పెట్రోల్ పోసుకుని అంటించుకునే ప్రయత్నం చేయగా రెవెన్యూ సిబ్బంది అప్రమత్తమై అడ్డుకున్నారు. దాంతో అక్కడ పెనుప్రమాదం తప్పింది. అనంతరం అధికారుల వైఖరిని నిరసిస్తూ కార్యాలయం ఎదుట భూక్యా రాధాకృష్ణ, భూక్యా జయకృష్ణ నిరసనకు దిగారు. తహసీల్దార్ ఉషా శారద, ఎస్ఐ రాజేష్ కుమార్ రైతుకు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజేష్ కుమార్ దర్యాప్తు చేపట్టారు.