Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్, మధ్యప్రదేశ్‌లకు ఓ న్యాయం... తెలంగాణకు మరో న్యాయమా?
- ఐదేండ్లలో రాష్ట్రానికిచ్చింది రూ. 311 కోట్లే
- అవార్డులు, ప్రశంసలే కాదు..నిధులూ ఇవ్వండి : ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మిషన్ భగీరథపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదనే విషయం పార్లమెంట్ సాక్షిగా బట్టబయలైందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా 2018 నుంచి 2021-22 వరకు రూ.2455.82 కోట్ల రూపాయల నిధులు కేటాయించామంటూ కేంద్ర జలజీవన్ మిషన్ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లిఖితపూర్వకంగా తెలిపారని పేర్కొన్నారు. నాలుగేండ్లలో తెలంగాణకు ఇచ్చిన రూ.311.41 కోట్లను జాతీయ గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా నిర్వహణ, దానిపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమానికి వినియోగించామని సభలో కేంద్ర మంత్రి చెప్పారని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లకు పనులు మొదలుపెట్టిన దశలోనే వందలాది కోట్ల రూపాయల నిధులను ధారాదత్తం చేసిందని వివరించారు. కేంద్రం నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా తెలంగాణ మిషన్ భగీరథకు అందించలేదనే విషయం తేలిందని విమర్శించారు. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి జల్ జీవన్ మిషన్ పథకాన్ని జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టిందనీ, రాష్ట్రానికి పలు అవార్డులను ఇచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నయాపైసా ఇవ్వకపోయినా సీఎం కేసీఆర్ చొరవ చూపెట్టి రూ.35వేల కోట్లతో మిషన్‌భగీరథ పథకం చేపట్టారని కొనియాడారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష మానుకోవాలనీ, అవార్డులు, ప్రశంసలు మాత్రమే కాకుండా నిధులూ అందించాలని డిమాండ్ చేశారు.