Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ హెల్త్ ప్రొఫైల్‌కు ములుగు ఎంపిక
- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ
నవతెలంగాణ-ములుగు
మారుమూల ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కింద ములుగు జిల్లాను ఎంపిక చేసిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి గంగాధర్, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో కలిసి జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ అమలు కోసం వైద్య శాఖ అధికారులతో వాకాటి కరుణ మంగళవారం సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. హెల్త్ ప్రొఫైల్‌ను సమర్ధవంతంగా నిర్వహించి ముందువరుసలో నిలవాలని సూచించారు. మెడికల్ ఆఫీసర్లందరికీ శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో నమోదైన పేర్లను, చికిత్సను ధ్రువీకరించినట్టు తెలిపారు. అదే పద్ధతిలో గ్రామాల్లో 18 ఏండ్లకుపైబడ్డ వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి, బ్లడ్ గ్రూప్, టోటల్ బాడీ చెకప్, షుగర్ లెవెల్, డయాలసిస్ తదితర వివరాలను హెల్త్ ప్రొఫైల్‌లో పొందుపర్చాల్సి ఉంటుందని చెప్పారు. తద్వారా ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచవచ్చన్నారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, తదితర రక్త నమూనాలు సేకరించి హెల్త్ ప్రొఫైల్‌లో అప్లోడ్ చేస్తే ఇండెంట్ ప్రకారం మెడిసిన్ అందించేందుకు వీలుంటుందని చెప్పారు. సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి దామోదర్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం హెల్త్ ప్రొఫైల్ తయారు చేసేలా కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఏఎన్ఎం, ఇద్దరు ఆశా కార్యకర్తలతో బృందంగా ఏర్పడి ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ.. జిల్లాలో కోవిడ్ మొదటి డోస్ 96, రెండో డోస్ 55 శాతం పూర్తి చేశామన్నారు. ఈ-ఔషద్ డాటా, ఓపీ మాడ్యుల్ డాటా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలిపారు. హెల్త్ ప్రొఫైల్ ద్వారా మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు మేలు కలుగుతుందని చెప్పారు. అవసరమైన సదుపాయాలు సమకూర్చేందుకు నివేదిక ఇవ్వాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. అనంతరం డీఎంహెచ్ఓ డాక్టర్ అల్లెమ్ అప్పయ్య మాట్లాడారు. జిల్లాలో 153 బృందాలను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో ములుగు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్వర్, ఏటూరునాగారం ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్ కుమార్, డాక్టర్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.