Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి : సీఎం కేసీఆర్‌కు జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. వారికి కనీస వేతనాలు చెల్లించాలని కోరారు. గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లను తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని తెచ్చిందని గుర్తు చేశారు. 25 వేల సర్కారు బడుల్లో సుమారు 83 వేల మంది మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ఆ కార్మికులు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.280 కోట్ల బకాయిలకుగాను కేవలం రూ.114 కోట్లు విడుదల చేసి చేతులు దులుపేసుకుందని విమర్శించారు. ఈ డబ్బులు కిందిస్థాయి వరకు అందలేదని వివరించారు. దీంతో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తున్నదని పేర్కొన్నారు. కొన్నిచోట్ల గుడ్లు, పండ్లు అందడం లేదని తెలిపారు. వంటగ్యాస్, కూరగాయలు, గుడ్లు వంటి నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం మెస్ ఛార్జీలను పెంచడం లేదని విమర్శించారు. కార్మికులు వేలాది రూపాయలు వడ్డీలకు తెచ్చి పిల్లలకు భోజనం వండి పెడుతున్నారని వివరించారు. గుడ్డు పెట్టలేదనే కారణంతో కార్మికులను వేధిస్తూ తొలగిస్తున్న ఘటనలున్నాయని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులంతా ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ తరగతులకు చెందిన పేదలేనని పేర్కొన్నారు.