Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెల 22న ఉన్నతాధికారులకు నోటీసు
- 23న నోటీసుల అందజేత
- ఈ లోపు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు : ప్రభుత్వ ఆస్పత్రుల వర్కర్ల ధర్నాలో భూపాల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్న వర్కర్ల వేతనాల పెంచాలనే డిమాండ్ సాధన కోసం జనవరి ఐదున ఒక రోజు సమ్మె నిర్వహించనున్నట్టు తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టియుఎంహెచ్ఇయూ) రాష్ట్ర అధ్యక్షులు భూపాల్ తెలిపారు. ఆ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ధర్నాచౌక్ వద్ద మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి ధర్నాకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు, వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు ఈ నెల 22న, ఆయా జిల్లాల్లో ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు 23న సమ్మె నోటీసులు అందజేయనున్నట్టు తెలిపారు. సమ్మెకు ముందు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ స్పందన ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పారు. కార్మిక చట్టాలను అమలు చేయటం లేదని తెలిపారు. రెగ్యులరైజేషన్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాల కల్పన కోసం డిఎంఈ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ నెరవేరలేదని చెప్పారు. పోరాడే యూనియన్ వెంట కార్మికులు ఐక్యంగా నిలబడితే హక్కులు సాధించుకోగలుతామని పిలుపునిచ్చారు.
మంత్రి ఆస్పత్రుల చుట్టు తిరిగితే సరిపోద్దా?
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు జె.వెంకటేష్ మాట్లాడుతూ, రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు మంత్రులు మారినా.... వర్కర్ల బతుకులు మాత్రం మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాస్పత్రులకు తిరుగుతుండటం మంచిదేననీ, అయితే ఆయన వర్కర్ల జీతాల సంగతి గురించి మాత్రం మాట్లాడటం లేదని విమర్శించారు. 2018 జులై ఒకటి నుంచి పెరగాల్సిన జీతాలను నేటికి పెంచకుండా అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సేవలు చేసిన వారినే మరిచిన కేసీఆర్
తెలంగాణ ఉద్యమ సమయంలో దీక్ష చేసిన కేసీఆర్‌కు సేవలందించిన నిమ్స్ కాంట్రాక్ట్ సిబ్బందికి సీఎం ఇచ్చిన మాటను మరిచారని నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఈశ్వర్రావు తెలిపారు. తామంతా పోరాడి వేతనాల పెంపును సాధించుకున్నామనీ, మరోసారి పోరాటానికి సిద్దమవుతున్నామని తెలిపారు. సీఐటీయూ ఇచ్చే పిలుపులో భాగంగా మిగతా ఆస్పత్రుల వర్కర్లతో కలిసి ఐక్య పోరాటంలో భాగస్వాములమవుతామని తెలిపారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి సూర్యం మాట్లాడుతూ హక్కుల సాధనలో వర్కర్లందరూ కలిసి ఐక్య పోరాటం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కుమారస్వామి, దర్శన్ (హైదరాబాద్), ఆశన్న, అక్రమ్ ఖాన్ (ఆదిలాబాద్), శారద, రాజేశ్వరి (కరీంనగర్), నాగమణి, సత్తమ్మ, రామయ్య (నల్లగొండ), మల్లమ్మ, రవి (పెద్దపల్లి), నరేందర్ (జగిత్యాల), భాగ్య (సంగారెడ్డి), రమణ, నరేందర్, నాగరాజు, భాస్కర్ (భద్రాచలం), ఆర్.చంద్రమౌళి, కొండపాక జగన్, సదానందం, హేమలత (హుజూరాబాద్)తో తదితరులు పాల్గొన్నారు.