Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ సేవలు పెంచుతాం
- త్వరలో మరో నాలుగు క్యాథ్‌ల్యాబ్‌లు ప్రారంభిస్తాం
- వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రజలు రోగనిర్ధారణ, ఇతర మెడికల్ టెస్టుల కోసం ఇబ్బంది పడే పరిస్థితి పోవాలని, ఆస్పత్రుల వద్ద గంటల తరబడి, రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండొద్దని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ సేవలు పెంచాలని సూచిం చారు. త్వరలో మరో నాలుగు క్యాథ్‌ల్యాబ్‌లు అందుబాటులోకి తెస్తామన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో రూ.7 కోట్లతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, క్యాథ్ ల్యాబ్‌ను, ఫైరింజన్, ఆక్సిజన్ ప్లాంట్లు, ఓపీ స్లిప్పుల జారీ కేంద్రం తదితర అభివృద్ధి పనులను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉస్మానియాలో ప్రస్తుతం 2 సీటీ స్కాన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, గాంధీ ఆస్పత్రిలో మరో 4 క్యాథ్ ల్యాబ్‌లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. త్వరలో ఉస్మానియాలో 50 పడకల ఐసీయూ, కొత్త వెంటిలేటర్లు, మార్చురీని కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. రానున్న రోజు ల్లో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా మారుతుందని ఆశా భావం వ్యక్తంచేశారు. ఉస్మానియాకు ఎన్ఏబీసీ అక్రి డేషన్ కోసం కృషి చేస్తామన్నారు. జనవరి ఒకటో తేదీన మళ్లీ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శిస్తానని చెప్పారు. ఉస్మానియాకు కొత్త భవనంపై స్పందిస్తూ.. కోర్టు తీర్పు తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్రహ్మాండ మైన విజయం సాధించామంటూ హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా.. తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమ న్నారు.
థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: ఉన్నతాధికారులకు ఆదేశం
కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్, మూడో వేవ్ సన్నద్ధత పై మంగళవారం హైదరాబాద్‌లోని బి.అర్.కే భవన్లో మంత్రి సమీక్ష నిర్వహించారు. దక్షిణాఫ్రికా, యూకే తదితర దేశాల్లో ఒమిక్రాన్ ప్రబలుతున్నదనీ, మన దేశంలో కేరళ, మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి, ప్రభావాన్ని ఎప్పటికపుడు గమనిస్తూ రోజు వారీగా పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ నియమించాలని ఆదేశించారు. థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు ముందుగానే 21 లక్షల హౌం ఐసోలేషన్ కిట్లు, 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సదుపాయం కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే 27, 996 పడకలకు గానూ 25, 826 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం సమకూర్చారనీ, మిగతా పడకలకు వేగంగా ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని కోరారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌లో మందుల నిల్వలను నిర్వహించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి కోరారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.