Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కార్మికుల్ని పర్మినెంట్ చేయాలి
- వేతనాల సర్క్యులర్ విడుదల చేయాలి ొ డబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లో ప్రాధాన్యతివ్వాలి
- గురు, శుక్రవారాల్లో కలెక్టరేట్ల ఎదుట 48 గంటల దీక్షలు
- జనవరి మొదటి వారంలోగా సమస్యలు పరిష్కరించాలి.. లేకుంటే పదోతేదీన సమ్మె నోటీసు : ఇందిరా పార్కు వద్ద మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ దీక్షలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఢిల్లీ రైతాంగ పోరాట స్ఫూర్తితో పోరాటాలు చేస్తూ ముందుకెళ్తే పాలకులు సమస్యలను పరిష్కరించక తప్పదని పలువురు వక్తలు అన్నారు. మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పెంచిన వేతనాల సర్క్యూలర్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు. గురు, శుక్రవారాల్లో కలెక్టరేట్ల ఎదుట జరిగే 48 గంటల దీక్షలు, వంటావార్పులను మున్సిపల్ కార్మికులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జనవరి మొదటి వారంలోగా రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే అదే నెల పదోతేదీన సమ్మె నోటీసు ఇస్తామని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీరమ మాట్లాడుతూ.. సకల సమస్యలకు తెలంగాణ పరిష్కారమన్న కేసీఆర్..రాష్ట్రమొచ్చి ఏండేండ్లు దాటుతున్నా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల్ని ఎందుకు పర్మినెంట్ చేయలేదని ప్రశ్నించారు. వేతనాలు పెంచట్లేదుగానీ నిత్యావసర ధరలను పెంచుతూ పోతున్నారని విమర్శించారు. పూలవర్షాలు కాదు..పూట గడిచే మార్గం చూపెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఏఐటీయూసీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎమ్డీ యూసుఫ్ మాట్లాడుతూ..సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజు వేతనం రూ.178 సరిపోతుందనిమోడీ సర్కారు పార్లమెంట్లో చెప్పడం దారుణమని విమర్శించారు. ఆ వేతనం సరిపోతే ఎంపీలకు, మంత్రులకు లక్షల రూపాయల వేతనాలు ఎందుకని ప్రశ్నించారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులకు గౌరవంగా బతికేలా న్యాయంగా జీతాలివ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులపై ఐదేండ్ల కాలానికే ఎన్నికయ్యే ప్రజాప్రతినిధుల అజమాయిషీ ఏంటని ప్రశ్నించారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ..కార్మికులు పోరాటాల్లో భాగస్వామ్యం కాకపోతే సమస్యలు పరిష్కారం కావన్నారు. కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెప్పి బొందల గడ్డగా మార్చారని విమర్శించారు. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్కే బోసు మాట్లాడుతూ.. మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికులు కష్టపడి పనిచేయడం వల్లనే రాష్ట్ర సర్కారుకు అవార్డులు వస్తున్నాయన్నారు. ఇంత చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. ఏఐయూ టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు బాబూరావు మాట్లాడుతూ..రోడ్లను శుభ్రం చేసే చీపుర్లను మర్లేసి పాలకులను కొడితేనే మున్సిపల్ కార్మికులకు పీఆర్సీ వస్తుందన్నారు. మున్సిపల్ స్టాఫ్, వర్కర్స్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె. ఏసురత్నం మాట్లాడుతూ..కార్మికుల జీతాలు పెంచేదాకా జేఏసీ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.దీక్షలో కూర్చున్న తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 68 వేల మంది మున్సిపల్ కార్మికుల పొట్టగొట్టాలని చూస్తే పాలకుల్ని బొంద పెడ్తామని హెచ్చరించారు. రూ.24 వేతనం ఇవాల్సిందేనని డిమాండ్ చేశారు. జీతాలు పెంచేదాకా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్లను పరిష్కరించకుంటే వచ్చే జనవరిలో మంత్రి కేటీఆర్ క్యాంపు ఆఫీసు ముట్టడికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. మున్సిపల్ స్టాఫ్ Ê వర్కర్స్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ యూనియన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు (ఏఐటీయూసీ) జయచంద్ర మాట్లాడుతూ..జీవితాలు మారాలంటే మున్సిపల్ కార్మికులు చైతన్యవంతులై పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆదర్శ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వామి మాట్లాడుతూ..మున్సిపల్ కార్మికులకు వారానికి ఒక్కరోజైనా సెలవు ఇవ్వాలని కోరారు. పనిగంటలు పెంచడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయు) రాష్ట్ర కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ ..పౌష్టికాహారం తీసుకోవాలంటూ ఊకదంపుడు ప్రచారాలు చేస్తున్న మోడీ..ఇచ్చే అరకొర వేతనంతో ఎలా తినాలో చెప్పాలని ప్రశ్నించారు. టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ దీక్షా కార్యక్రమానికి అధ్యక్ష వర్గంగా జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు జె.వెంకటేష్, మున్సిపల్ స్టాఫ్ Ê వర్కర్స్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర నాయకులు జైపాల్‌రెడ్డి, తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ప్రవీణ్, తెలంగాణ ఆదర్శ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శివబాబు, టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ముక్కాల ప్రసాద్, ఏఐయుటీయూసీ మున్సిపల్ యూనియన్ రాష్ట్ర నాయకులు హేమలత వ్యవహరించారు.