Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొత్తం ఆర్థిక వ్యవస్థకే నష్టం : ఏఐబీఓసీ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ ప్రధాన కార్యదర్శి గాలేటి నాగేశ్వర్
''ప్రభుత్వ బ్యాంక్‌లను ప్రయివేటీకరించడం ద్వారా ఈ రంగంలో కార్పొరేట్ల గుత్తాదిపత్యానికి బాటలు పడనున్నాయి. రుణాల జారీలో పక్షపాత దోరణీతో ఆర్థిక వ్యవస్థలో అసమానతలు పెరుగుతాయి. బ్యాంక్‌ల జాతీయీకరణకు ముందు నాటి వడ్డీ వ్యాపారుల బ్యాంకింగ్ విధాన రోజులు మళ్లీ రావొచ్చు. అధిక వడ్డీ రేట్లతో ప్రజలపై భారం పడొచ్చు. ప్రస్తుత ఉద్యోగులు, అధికారులు తీవ్రంగా నష్టపోనున్నారు. భద్రతతో కూడిన కొత్త ఉద్యోగాల సృష్టికి అవకాశం ఉండదు.'' అని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ) జాతీయ ఉపాధ్యక్షులు,తెలంగాణ ప్రధాన కార్యదర్శి గాలేటి నాగేశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంక్‌ల ప్రయివేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 16, 17న బ్యాంక్‌ల సమ్మెకు పిలుపునిచ్చామని ఆయన నవతెలంగాణ వాణిజ్యప్రతినిధికి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఆ వివరాలు..
నాడు వ్యతిరేకించి..నేడు ప్రయివేటు బాటలో...
ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను మోడీ సర్కార్ కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నం చేస్తోంది. 1969కు ముందు ప్రయివేటు వారి చేతుల్లో ఉన్న బ్యాంక్‌లను అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ జాతీయీకరణ చేశారు. ఆ సమయంలోనూ బీజేపీకి చెందిన జన సంఫ్‌ు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు తిరిగి మళ్లీ మోడీ సర్కార్ అదే ప్రయత్నం చేస్తోంది. ప్రయివేటు శక్తులకు బ్యాంక్‌లను అప్పగిస్తే తిరిగి బడా వడ్డీ వ్యాపారులను ప్రోత్సహించడమే అవుతుంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు దేశంలో 28 ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ఉన్నాయి. అన్నిటినీ ప్రయివేటీకరిస్తే తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించింది. ఈ క్రమంలోనే పలు బ్యాంక్‌లను విలీనం చేసి పీఎస్‌బీల సంఖ్యను డజన్‌కు తగ్గించింది. దీని ద్వారా ప్రభుత్వ బ్యాంక్‌లను సులభంగా విక్రయించొచ్చని ఎత్తుగడ వేసింది. విలీన లక్ష్యాలు నెరవేరుతుండటంతో తాజాగా ప్రయివేటీకరణ, డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేసింది. తొలుత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్‌లను ప్రయివేటీకరించే ప్రతిపాదనలు సిద్దంగా ఉన్నాయని రిపోర్టులు వస్తున్నాయి.
ఉద్యోగులకు ఎలాంటి నష్టం ..?
ప్రయివేటీకరణ వల్ల ఉద్యోగులకు మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు నష్టం జరగనున్నది. ప్రయివేటీకరణ తర్వాత ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏండ్ల నుంచి 55 ఏండ్లకు కుదించనున్నారు. ఉద్యోగులు, అధికారుల వేతనాలను తగ్గించే ప్రమాదం ఉన్నది. ముఖ్యంగా ఉద్యోగ భద్రత కోల్పోతాం. దీంతో ప్రాథమిక హక్కుకే భంగం వాటిళ్లనున్నది. పీఎస్‌బీలను కార్పొరేట్లకు అప్పగించడం ద్వారా కాంట్రాక్టు పద్దతిలో నియామకాలు చేపటనున్నాయి. కొత్త ఉద్యోగాలు పడిపోనున్నాయి. ఒక వేళ తీసుకున్న తక్కువ వేతనాలకు పని చేయాల్సి ఉంటుంది. అదే విధంగా రిజర్వేషన్లు అమలు చేయరు. దీంతో సామాజిక అసమానతలు పెరుగతాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే బ్యాంక్ కింది స్థాయి సిబ్బంది నుంచి స్కేల్ 4 అధికారుల వరకు సమ్మెలో భాగస్వామ్యం అవుతున్నారు.
సామాన్యులపై ప్రభావం ఎలా ఉండొచ్చు..
ప్రయివేటు బ్యాంక్‌లు ఎప్పుడూ సేవా భావంతో పని చేయవు. లాభాలే లక్ష్యంగా పని చేస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు నీరుగారనున్నాయి. ఉదాహరణకు.. జన్ ధన్ యోజన, ముద్రా, వీది వ్యాపారులకు మద్దతు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాన్ యోజన, రైతు పథకాలు, అటల్ పెన్షన్ యోజన తదితర సంక్షేమ పథకాలకు ప్రయివేటు బ్యాంక్‌లు మద్దతును ఇవ్వవు. దీంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోనున్నారు. ఇప్పుడున్న ప్రయివేటు కార్పొరేట్ బ్యాంక్‌లకు వెళుతున్న ప్రజల సంఖ్య అతి తక్కువ అన్న విషయం తెలిసిందే. ఆయా బ్యాంక్‌ల్లో సేవింగ్ ఖాతా తెరవాలన్న కనీసం రూ.10వేల డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంత మొత్తం ఒక సామాన్యుడికి సాధ్యం కాదు. అంటే కార్పొరేట్ బ్యాంక్‌లను ప్రోత్సహించడమంటే పేద, సామాన్య ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థకు దూరం చేయడమే అవుతుంది.
ప్రయివేటు బ్యాంక్‌లు రాణించలేవా..?
దేశంలో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, యునైటెడ్ వెస్ట్రన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కరాడ్, చార్మినర్ బ్యాంక్ తదితర బ్యాంక్‌లు మూతపడ్డాయి. కొన్ని దివాలా తీశాయి. ప్రయివేటు రంగంలో టాప్ 3గా చెప్పుకున్న యెస్ బ్యాంక్ దివాలా తీస్తే.. ఎస్బీఐ స్వాధీనం చేసుకున్నది. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్ వీడియో కాన్ యాజమాన్యంతో లాలూచీ పడి, క్విడ్ప్రోకు పాల్పడ్డారు. దీంతో ఆమె జైలు జీవితం అనుభవించారు. ప్రయివేటు బ్యాంక్‌లు తమకు కావాల్సిన వారికి మాత్ర మే రుణాలు ఇస్తాయనేది అనేక సార్లు రుజువైంది. దీని వల్ల దివాలా తీసే అవకా శాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ బ్యాంక్‌లను ప్రయివేటుకు అప్పగించడమంటే ప్రజల డిపాజిట్ల సొమ్మును అప్పనంగా కార్పొరేట్లకు కట్టబెట్టడమే. ప్రజా సంక్షేమాన్ని, భారత ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని మోడీ సర్కార్ బ్యాంక్‌ల ప్రయివేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.