Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం
ొ 12లో 6 ఏకగ్రీవం.. 6 గెలుపు
- పలుచోట్ల తగ్గిన ఓట్లు.. క్రాస్ ఓటింగ్
- ఖమ్మంలో కాంగ్రెస్‌కు క్రాస్ అయిన ఓటింగ్
నవతెలంగాణ- విలేకరులు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. మొత్తం 12 స్థానాలకు.. ఆరు స్థానాలు ఏకగ్రీవం కాగా.. ఆరింటిలో ఎన్నికలు నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, వరంగల్‌లో రెండు చొప్పున, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థులతోపాటు, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. అయితే, ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచినా అక్కడక్కడా ఓటింగ్ తగ్గడం గమనార్హం. క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు టి.భానుప్రసాద్‌రావు, ఎల్.రమణ విజయం సాధించారు. టీఆర్ఎస్ను వీడిన మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి చెప్పుకోదగ్గ ఓట్లనే రాబట్టగలిగారు. ఈయనకు బీజేపీ నుంచి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత ఈటల రాజేందర్ బహిరంగంగానే మద్దతు పలికారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1324 ఓట్లు ఉండగా.. అందులో 996 టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే. 1303 ఓట్లు పోలవ్వగా.. టీఆర్ఎస్ అభ్యర్థి భానుప్రసాద్‌రావుకు 585, ఎల్.రమణకు 479 మాత్రమే దక్కాయి. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన రవీందర్‌సింగ్‌కు 232 ఓట్లు పడ్డాయి. ఏదేమైనా ప్రజాప్రతినిధులను క్యాంపులకు తీసుకెళ్లడం, ఇతర ప్రయోజనాలన్నీ తాను పోటీలో ఉండటం వల్లే జరిగాయని రవీందర్ సింగ్ వ్యాఖ్యానించారు.
ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. మొత్తం 937 ఓటర్లకుగాను 862మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన దండె విఠల్‌కు 742ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పెందూర్ పుష్పరాణికి 75ఓట్లు వచ్చాయి. మరో 45ఓట్లను చెల్లనివిగా అధికారులు నిర్ధారించారు. విజయం సాధించిన విఠల్‌ను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మెన్లు, ప్రజాప్రతినిధులు అభినందించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అధికార టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఎంసీ కోటిరెడ్డి విజయం సాధించారు. రెండో స్థానంలో స్వతంత్య్ర అభ్యర్థి కె.నగేష్ నిలిచారు. ఎన్నికలో ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 1271 ఓట్లకుగాను, 1233 ఓట్లు పోలయ్యాయి. 1183 ఓట్లు చెల్లుబాటు కాగా, 50 ఓట్లు చెల్లుబాటు కాలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డికి 917, స్వతంత్య్ర అభ్యర్థి కె.నగేష్‌కు 226, వంగూరి లక్ష్మయ్య 26, కాసర్ల వెంకటేశ్వర్లు 06, ఏర్పుల శ్రీశైలం 03 ఓట్లు పోలయ్యాయి.
మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో మొత్తం 1018 ఓట్లకు గాను టీఆర్ఎస్పార్టీ అభ్యర్థి యాదవరెడ్డి 524ఓట్ల మెజార్టీతో గెలు పొందారు. యాదవ్రెడ్డికి 762 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలకు238, స్వతంత్ర అభ్యర్థి మల్లారెడ్డికి 6ఓట్లువచ్చాయి. 12 ఓట్లు చెల్లుబాటు కాలేదు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్‌రావు.. కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుపై 238 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మొత్తం 768 ఓట్లకుగాను 738 పోలయ్యాయి. వీటిలో 12 ఓట్లు చెల్లుబాటు కాలేదు. మిగతా 726 ఓట్లలో తాతా మధుకు 480, కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుకు 242 ఓట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావుకు 4 ఓట్లు లభించగా మరో స్వతంత్ర అభ్యర్థి కొండ్రు సుధారాణికి ఒక్క ఓటు కూడా రాకపోవడం గమనార్హం. ఆమె కూతురు ఆళ్లపల్లి ఎంపీపీ కొండ్రు మంజుభార్గవి టీఆర్ఎస్ తరఫున ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఆమె సైతం తల్లికి ఓటు వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.
చర్చనీయాంశమైన క్రాస్ ఓటింగ్
వాస్తవానికి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 550 ఓట్లు ఉండగా.. 480 ఓట్లు మాత్రమే ఆ పార్టీకి పోల్ అవడం చర్చనీయాంశమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ మొత్తం 470 స్థానాలను కైవసం చేసుకోగా. ఇతర పార్టీల నుంచి 80 మంది వరకు టీఆర్ఎస్లో చేరారు. ఇలా ఆ పార్టీ బలం 550కి చేరింది. కానీ అందులో కొన్ని ఓట్లు కాంగ్రెస్‌కు క్రాస్ అవడం చర్చకు దారితీస్తోంది. దీనిపై టీఆర్ఎస్లో ఇప్పటికే పోస్టుమార్టం మొదలైనట్టు తెలుస్తోంది.