Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ ప్రభుత్వ కన్ను తాజాగా సహకార రంగంపై పడింది. ప్రజల ఉమ్మడి సహకారంతో సమీకృతమైన స్థిర, చరాస్తులను ఎలాగైనాసరే తన అధీనంలోకి తెచ్చుకొని అప్పనంగా కార్పొరేట్ల హస్తగతం కావించే పన్నాగానికి బిజెపి ప్రభుత్వం పక్కాగా స్కెచ్ వేసింది. ఆదివారంనాటి బ్యాంక్ డిపాజిటర్ల ఇన్సూరెన్స్ పథకం ప్రారంభ సమావేశ వేదికపై ప్రధాని మోడీ, ఆర్బిఐ గవర్నర్‌ను, కేంద్ర ఆర్థిక మంత్రిని చెరోపక్కన కూర్చోబెట్టుకొని సహకార బ్యాంకుల సంస్కరణల పేరిట కో-ఆపరేటివ్స్ మెడపై కత్తి పెట్టారు. కమర్షియల్ బ్యాంకులకు మాదిరిగానే కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులపై వేసిన కమిటీ రిపోర్టు వచ్చిందని, చర్యలు చేపట్టవలసి ఉందని అదే వేదికపై ఆర్బిఐ గవర్నర్ చెప్పుకొచ్చారు. అంతేనా, అధిక రాబడి కల్పిస్తామనే అర్బన్ బ్యాంకులపై మదుపుదార్లు అప్రమత్తత పాటించాలని, అధిక రాబడికి అధిక నష్టాల భయమూ ఉంటుందన్నారు. ప్రధాని మరో అడుగు ముందుకేసి, తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అర్బన్ బ్యాంకులు మూతబడ్డప్పుడు ప్రజలు తన గొంతు పట్టుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ విధంగా ప్రధాని, ఆర్‌బికె గవర్నర్ కూడబలుక్కొని కావాలని ఒక పథకం ప్రకారం కో-ఆపరేటివ్స్‌పై విషం చిమ్మారు. దీని వెనుక మర్మం కార్పొరేట్ల లబ్ధేనన్నది స్పష్టం. మొన్న జులైలో కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడమే కాకుండా హోం మంత్రి అమిత్‌షాకు ఆ శాఖ బాధ్యతలు అప్పగించారు మోడీ. రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్లో సహ కార శాఖ రాష్ట్రాల పరిధిలోని అంశం. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, సమాఖ్య వ్యవస్థకు పూర్తి విరుద్ధంగా, రాష్ట్రాల అధికారాలను కేంద్రం ఆక్రమించింది. దేశ వ్యాప్తంగా ఉన్న కో-ఆపరేటివ్స్ మొత్తాన్నీ తన నియం త్రణలోకి తెచ్చుకొని వాటిపై పెత్తనం చేసే కుట్ర. డిసిసిబిల విలీనం, అర్బన్ బ్యాంకుల కార్యకలాపాలపై ఆంక్షలు, చివరికి గ్రామాల్లోని పిఎసి ఎస్‌ల వరకు అన్నింటిపైనా కేంద్రానిదే నియంత్రణ. వాటన్నింటినీ రాష్ట్రా ల పరిధి నుండి ఆర్బిఐ కంట్రోల్లోకి లాగుతోంది. కమర్షియల్ బ్యాంకు ల్లో భారీగా రుణాలు తీసుకొని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొడుతున్న అంబానీ, అదానీ, విజరు మాల్యా వంటి వారి రూ.లక్షల కోట్లను మాఫీ చేసే క్రమంలో బ్యాంకుల భద్రత, డిపాజిట్‌దారుల రక్షణ కేంద్రానికి గుర్తుకు రాలేదు. అదే సహకార రంగంలోనైతే రుణాలు సామాన్యునికిచ్చేవి గనుక మాఫీ చేయాలనే ప్రతిపాదన మోడీ నోట రాలేదు. ఇక్కడ డిపాజిటర్ల పట్ల ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ డిపాజిటర్లలోనే అత్యధికులు సహకార బ్యాంకుల షేర్ హోల్డర్లన్న వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మరుగుపరిచింది. మన దేశంలో 1904 ప్రాంతంలో సహకార ఉద్యమం అంకురిం చింది. స్వాతంత్య్రోద్యమం, సహకార ఉద్యమం కలగలిసి ముమ్మరంగా సాగింది. అగ్రి క్రెడిట్, బ్యాంకింగ్, హౌసింగ్, సుగర్, డెయిరీ, ఖాదీ, అనేకా నేక రంగాల్లో ప్రజలు, ఆ యా వర్గాల ప్రజల భాగస్వామ్యంలో కో-ఆపరేటివ్స్ విలసిల్లుతున్నాయి. కేరళలో వామపక్ష ప్రభుత్వం సహకార స్ఫూర్తిని భుజానికెత్తుకొని ఆ రంగాన్ని బలోపేతం చేస్తోంది. ఆర్థిక, సామాజిక, ఉత్పత్తి, మార్కెటింగ్ కార్యక్రమాలను పరస్పర సహకారంతో విజయవంతంగా నిర్వహించు కుంటున్నాయి. దేశంలో సరళీకరణ విధానాలొచ్చాక సహకార వ్యవస్థకు ముప్పు వచ్చి పడింది. కొన్ని లోపాలు, అవినీతి, అక్రమాలను చూపించి సహకార రంగం నిర్వీర్యానికి పాలకుల ప్రయత్నాలు సాగుతుండగా, ఇప్పుడు మొత్తానికే ఆ రంగం పీకనొక్కేం దుకు మోడీ సర్కారు ఎత్తు వేసింది. బ్యాంకుల విలీనం వంటి చర్యలతో కార్పొరేట్లకు పెట్టుబడిని కేంద్రీకరించగా, అది చాలదన్నట్లు సహకార రంగంలోని ఆస్తులను, నిధు లను, ప్రజల పెట్టుబడులను కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకు పూను కుంది. ఇంట్లో ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టుకున్న చందంగా లోపా లున్నాయని సహకార రంగాన్ని చంపే యడం దుర్మార్గం. నల్ల సాగు చట్టాల వ్యతిరేక రైతు ఉద్యమ స్ఫూర్తితో కో-ఆపరేటివ్స్ పరిరక్షణకు సహకార రంగ ప్రేమికులు, ప్రజాస్వామిక వాదులు, లబ్ధిదారులు ఉద్యమించాల్సిన తరుణం సమీపించింది.