Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1955లో జాతీయం చేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. 1969లో 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేశారు. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు, బ్యాంక్ రుణాలు సామాన్యులకు అందడం, పైగా అప్పటివరకు బ్యాంకింగ్ రంగ సేవలు అందని ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల వంటి మారుమూల ప్రాంతాలకు కూడా ఆ సేవల అందేలా చూడడం ఈ ప్రైవేటీకరణ వెనుక గల ముఖ్యోద్దేశంగా వుంది. ఈ లక్ష్యాన్ని చాలా త్వరగానే సాధించారు. అసమానతలను తగ్గించడమనేది జాతీయకరణ సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి. ఉన్నత స్థాయిలోని వ్యక్తుల వద్ద సంపద పోగుపడడం తగ్గింది.అత్యంత కింది స్థాయిలోని వారి వద్ద సంపద నిలకడగా పెరుగుతూ వస్తోంది. 1991 నుండి ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆదేశాల మేరకు నయా ఉదారవాద ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టారు. ఇందులో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రధాన విధానపరమైన మార్పులు కూడా వున్నాయి. ఇండిస్టియల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంక్, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఆర్థిక సంస్థల అభివృద్ధిలో తమ పాత్రను మరిచి బ్యాంకులను ప్రోత్సహించేలా బలవంతంగా మార్చారు. అభివృద్ధి క్రమానికి ఆర్థిక సాయం అందించే సంస్థలుగా వాటి పాత్రను విస్మరించారు. ఈనాడు అవన్నీ కూడా ప్రైవేటు రంగ బ్యాంకులుగా వున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు ప్రధాన వాటాదారులుగా వున్నారు. స్వదేశీ ఉద్యమం ద్వారా ఏర్పడిన పాత తరం ప్రైవేటు బ్యాంకుల కన్నా ఇవి భిన్నంగా వున్నాయి. ఈ కొత్త తరం బ్యాంకులు ఎగువ మధ్య తరగతి వర్గం, సంపన్నుల అవసరాలను తీరుస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకులుగా ప్రారంభమైన గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, సెంచూరియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి కనిపించడం లేదు. ఇతర బ్యాంకులు వాటిని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. జాతీయకరణ తర్వాత కూడా 30కి పైగా ప్రైవేటు రంగ బ్యాంకులను ప్రభుత్వ రంగ బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల నిర్వహణా తీరు సరిగా లేకపోవడమే అందుకు కారణం. బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల సామర్ధ్యం మరింత మెరుగవుతుందని ఇప్పుడు మన ఆర్థిక మంత్రి చెబుతున్నారు. ఇది ఎండమావి కూడా కాదు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, దీవాన్ హౌసింగ్, ఎస్ బ్యాంక్ వంటి పెద్ద బ్యాంకింగ్యేతర ఫైనాన్షియల్ కంపెనీలు కుప్పకూలడం మనం ఇటీవలే చూశాం. ఎస్ బ్యాంక్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదుకోవాల్సి వచ్చింది. ఐడిబిఐ బ్యాంక్‌ను ఎల్ఐసి కాపాడాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ఏవి సమర్ధతతో పనిచేస్తున్నాయి? దురదృష్టవశాత్తూ మన ఆర్థిక మంత్రిగారు దాన్ని గుర్తించడం లేదు. ఎందుకంటే ఆమె పార్టీ, ప్రధాని కూడా ఇప్పటికే - వ్యాపారంలో వుండాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదనే ఆలోచనకు అంకితమై పోయారు. ప్రపంచ బ్యాంక్ ఆలోచన కూడా ఇదే, పాలక పార్టీకి సిద్ధాంతాలను బోధించే సంఘ పరివార్‌ది కూడా ఇదే ఆలోచన. పెద్ద చేప చిన్న చేపను మింగుతుందంటూ ఎం.ఎస్గోవాల్కర్ తన పుస్తకం ''ఎ బంచ్ ఆఫ్ థాట్స్' లో పేర్కొన్నారు. ఇది సహజం. అందుకు మనం పెద్ద చేపను నిందించరాదు.
ప్రైవేటీకరణ నయా సంపన్నులకు సాయపడుతుంది. వారివే ఇప్పుడు కార్పొరేట్ సంస్థలన్నీ. ఈనాడు ప్రభుత్వం పరిమిత పోటీ వుండే పరిస్థితులను సృష్టిస్తోంది. అదానీ, అంబానీ, టాటాలు, అగర్వాల్ ఇంకా కొద్దిమందే వున్నారు. తాజాగా అసనమాతలపై వెలువడిన నివేదిక ప్రకారం, దేశంలోని 22శాతం సంపద సంపన్నుల వద్దే పోగుపడింది. ప్రైవేటీకరణ వల్ల సామాన్యుడు స్థానికంగా ఆర్థిక వ్యవస్థను శాసించే వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల్లోకే తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రైవేటీకరణకు ముందు ఇదే పరిస్థితి నెలకొని వుండేది. బ్యాంకింగ్యేతర ఆర్థిక కంపెనీలు, ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు (ఫైన్ టెక్స్) అధిక వడ్డీ రేట్లు, సర్వీసు ఛార్జీలంటూ పేదలను, మధ్య తరగతి వర్గాలను పిండేస్తాయి. భారతదేశంలో చదువుకునేందుకు విద్యార్ధులకు విద్యా రుణాలు లభించవు. యువతకు స్వయం ఉపాధి కోసం రుణాలు దొరకవు. తక్కువ వడ్డీ రేటుతో రుణాలు తీసుకుని సాగు చేసుకుందామనుకునే చిన్న, మధ్య తరహా రైతులు, చివరకు సంపన్నులైన రైతులకు కూడా వ్యవసాయ రుణాలు దొరకవు. చిన్న, మధ్య తరహా, సూక్ష్మ పరిశ్రమలకు వారి వ్యాపార కార్యకలాపాలకు రుణం లభించదు. దేశంలోని పెద్ద సంఖ్యలో గల వ్యాపారస్తులు కేవలం వడ్డీ వ్యాపారస్తులపైనే ఆధారపడాల్సిన పరిస్థితులేర్పడతాయి. మహిళలకు తమ స్వయం సహాయ గ్రూపులకు రుణాలు దొరకవు. ఇంటి ఆర్థికావసరాలకు ఈ స్వయం సహాయ గ్రూపులు బాగా తోడ్పాటునిస్తాయి. పేద, మధ్య తరగతి వర్గాలకు చవకగా ఇంటి రుణాలు లభ్యం కావు. ఇవన్నీ కూడా పెను విపత్తుకు దారి తీస్తాయి. సామాన్యుడికి ఇదంతా అర్ధమవుతుందా? కుటుంబాల్లో, టీ దుకాణాల్లో, వీధుల్లో, బ్యాంకుల చుట్టుపక్కలా మొత్తంగా కింది స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు దీనిపై మనందరం చర్చ ప్రారంభించాల్సిన అవసరం వుంది.
ప్రైవేటీకరణ రాజ్యాంగ వ్యతిరేకం, రిజర్వేషన్ విధానాన్ని ఎత్తివేస్తుంది. అందరినీ కలుపుకుని పోయే ఆర్థిక వ్యవస్థను అంతమొందిస్తుంది. ఇదే మేల్కొలుపు.
- డి.థామస్ ఫ్రాంకో
ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్
మాజీ ప్రధాన కార్యదర్శి
పీపుల్ ఫస్ట్ జాయింట్ కన్వీనర్