Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడోరోజూ మంత్రి రివ్యూ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పొరుగు రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలోనే కరెంటు చార్జీలు తక్కువగా ఉన్నాయని విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు ఆ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి చెప్పారు. మూడో రోజైన బుధవారం కూడా కరెంటు చార్జీల పెంపు ప్రతిపాదనలపై మంత్రి సమక్షంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పొరుగు రాష్ట్రాల్లోని కరెంటు చార్జీల లెక్కల నివేదికను అధికారులు మంత్రికి సమర్పించారు. టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి, డైరెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి స్వరాష్ట్రం గుజరాత్‌కంటే తెలంగాణలోనే కరెంటు చార్జీలు తక్కువగా ఉన్నాయనీ, ఇక్కడి రైతులకు ఉచిత కరెంటు ఉన్నదనీ, గుజరాత్లో లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలోనే చార్జీలు తక్కువని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ.10వేల కోట్ల సబ్సిడీని ఇస్తున్నా, విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల్లోనే ఉంటున్నాయని ఏకరువు పెట్టారు. రాష్ట్రంలో కరెంటు చార్జీలను పెంచినా, కేంద్రప్రభుత్వ విధాన నిర్ణయాల వల్ల డిస్కంలపై ఆర్థిక భారాలు పడి, మరింత నష్టాలపాలు కావల్సి వస్తున్నదని వివరించారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి సమర్పించాల్సిన టారిఫ్ ప్రతిపాదనలపై చర్చించారు. సీఎం కేసీఆర్ తుది ఆమోదం తర్వాత వాటిని ఈఆర్సీకి ఇవ్వాలని నిర్ణయించారు.