Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ గురుకులాల నిర్వహణ మెరుగుపడాలి
- విద్యార్థులను అత్యుత్తములుగా తీర్చిదిద్దాలి : మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ గురుకులాల నిర్వాహణ మరింత మెరుగుపడాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బుధవారం ఆ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న పిల్లలను అత్యుత్తములుగా తీర్చిదిద్దాలన్న తపనతో పనిచేయాలని సూచించారు. మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.ఎస్సీ గురుకులాలకు దేశంలోనే మంచి పేరు ప్రతిష్టలున్నాయని చెప్పారు. అవి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని వివరించారు. పేదలు, నిరుపేదలకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా అందరూ పనిచేయాలని ఆదేశించారు. అధికారులు తరచుగా పాఠశాలలను సందర్శించాలని చెప్పారు. హాజరు, తరగతుల నిర్వహణ, పరీక్షలు, ఫలితాలు, విజయాలపై మాత్రమే దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ గురుకులాల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ గురుకులాల నిర్వహణ, పురోగతి, సాధించిన ఫలితాలు,విజయాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నర్సింగ్, ఇంజనీరింగ్, బాలుర కోసం 15డిగ్రీ కాలేజీల ఏర్పాటు ప్రతిపాదన గురించి తెల్పగా.. మంత్రి కొప్పుల వెంటనే స్పందించి సీఎం దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్తానన్నారు. వివిధ పోటీ పరీక్షలు, క్రీడల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించే సభను త్వరలో ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. సమావేశంలో ఎస్సీ అభివృద్ధి శాఖ సెక్రటరీ రాహూల్ బొజ్జ, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితారాణా, సంయుక్త,ఉప,సహాయ కార్యదర్శులు, జోనల్,రీజినల్, జిల్లా కో-ఆర్డనేటర్లు పాల్గొన్నారు.