Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గరుడ యాప్‌పై పూర్తి స్థాయి అవగాహన అవసరం
- రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్
- సూర్యాపేటలో ఈవీఎం గోదాం ప్రారంభం
నవతెలంగాణ - చివ్వేంల/సూర్యాపేట
కొత్త జిల్లాల్లో ఈవీఎంల భద్రత కోసం గోదాములు నిర్మించి అందుబాటులోకి తెచ్చినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ వద్ద నూతన కలెక్టరేట్ పరిధిలో రూ.కోటి 30 లక్షలతో నిర్మించిన ఈవీఎం గోదామును బుధవారం కలెక్టర్ టి.వినరు కృష్ణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా నూతన జిల్లాల్లో 22 ఈవీఎం గోదాములకుగాను 20 ఇప్పటికే ప్రారంభించామని, మిగతా రెండింటి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. జిల్లాలో గతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా ఎక్కడ ఎలాంటి సమస్య,ఇబ్బందులూ రాకుండా సమర్థవంతంగా పూర్తి చేసినట్టు చెప్పారు. ఈసీఐ దేశ వ్యాప్తంగా గరుడ యాప్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఆ దిశగా బీఎల్వోలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇప్పటికే మొదటి దఫా శిక్షణ కూడా ఇచ్చినట్టు తెలిపారు. ఈవీఎం గోదాం మొదటి అంతస్తుకు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వ అనుమతితో నిధులు మంజూరు చేయిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు, ఆర్డీవోలు కిషోర్ కుమార్, రాజేంద్రకుమార్, వెంకట్‌రెడ్డి, తహసీల్దార్లు, ఎన్నికల పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, ఇఈ యాకుబ్, డీఈ మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.