Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోశయ్య సంస్మరణసభలో నేతలు
- హైదరాబాద్‌లో స్మృతివనం : రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు సమస్యలు ఎదురైనప్పుడు రోశయ్య ట్రబుల్షూటర్గా వ్యవహరించేవారనీ, ప్రతిపక్షాలకు మాత్రం ట్రబుల్ మేకర్‌గా ఉండేవారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఇతర ముఖ్యమంత్రుల స్థాయిలో హైదరాబాద్‌లో ఆయన పేరిట స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్సీగా తాను శాసనమండలిలో అడుగుపెట్టిన కొత్తలో తనకు ఎన్నో విలువైన సూచనలు చేశారన్నారు. తన రాజకీయ ఎదుగుదలకు అవే కారణమన్నారు. రోశయ్య స్ఫూర్తితో ముందుకు పోతామని చెప్పారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోశయ్య సంస్మరణ సభ జరిగింది. వైఎస్ హయాంలో క్యాబినెట్లో మంత్రులు పని చేసిన వారు, సన్నిహితులు, కుటుంబసభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రోశయ్యకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రకటించే ముందు ఆర్ధిక శాఖ మంత్రిగా ఉన్న రోశయ్యను ఒప్పించడం నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి కష్టంగా ఉండేదని గుర్తు చేశారు. మాజీ ఎంపీ టి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ అహంకారాన్ని జయించిన గొప్ప నేత రోశయ్య అన్నారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు జానారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కాసు వెంకటకృష్ణారెడ్డి, ఎన్ రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, మాజీ ఎంపీలు వి హనుమంతరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, టీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు, ఏపీ మంత్రి పేర్ని నాని, సీపీపీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుతోపాటు టీపీసీసీ నేతలు, ఇతర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని రోశయ్యకు శ్రద్ధాంజలి ఘటించారు.