Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యాహ్న భోజన కార్మికుల నిలదీత
- మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం (సీఐటీయూ) నిరసనలు
నవతెలంగాణ- విలేకరులు
పెండింగ్లో ఉన్న బిల్లులు మంజూరు చేయకుండా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టమంటే ఎలా పెట్టాలని మధ్యాహ్న భోజన కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ చార్జీల వేతనాలు పెంచాలనీ, గుడ్డుకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.5కోట్లు విడుదల చేయాలనీ, ఇతర పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నిజామాబాద్లో సౌత్ తహసీల్లో సంఘం జిల్లా కార్యదర్శి తోపునూరి చక్రపాణి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఒక్కో విద్యార్థికి రూ.15 స్లాబ్ రేటు పెంచి, ప్రతి పాఠశాలకు ఒక నెల అడ్వాన్సు బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎడపల్లి, వర్ని, రెంజల్ మండల కేంద్రాల్లో నిరసన చేపట్టారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మధ్యాహ్న భోజన కార్మికులు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేసి, కనీస వేతనం రూ.10 వేలు ఇవ్వాలని, నిత్యావసర ధరలకనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని కోరారు. గుడ్లకు అదనంగా బడ్జెట్ ఇవ్వాలని, సబ్సిడీపై గ్యాస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థికీ రూ.12 మెస్ చార్జీలు చెల్లించాలని, గుడ్డు ధర నాలుగు నుంచి ఏడు రూపాయలు పెంచాలని కోరారు. లేబర్ యాక్ట్ ప్రకారం వేతనం చెల్లిస్తూ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తాహసీల్దార్ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు.