Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
- 20న కలెక్టరేట్ ఎదుట ధర్నా
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ - వైరాటౌన్/తల్లాడ
మిర్చి తోటల నష్టాన్ని ప్రకృతి విపత్తుగా భావించి రైతులకు ఎకరానికి రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మిర్చి తోటలకు వైరస్‌తోపాటు గులాబీ, ఎర్ర రంగు పురుగుల వల్ల లక్షలాది ఎకరాల్లో భారీ నష్టం జరిగిందన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం, తల్లాడ మండలం కేశపురం గ్రామాల్లో వైరస్‌తో దెబ్బతిన్న మిర్చి తోటలను బుధవారం సీపీఐ(ఎం), రైతు సంఘం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా నున్నా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగైందని, దానిలో 80 శాతం దెబ్బతినడంతో రైతులు మిర్చి తోటలను తొలిగించి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం పంట నష్టంపై అంచనాలు కూడా తయారు చేయించటం లేదన్నారు. ఆరకొరగా అక్కడక్కడ మిగిలిన మిర్చి తోటలను రక్షించే ప్రయత్నంలో రైతులు భారీగా పెట్టుబడులు పెట్టుతున్నారన్నారు. మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ 20న ఖమ్మం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో రైతులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు మాట్లాడుతూ.. మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వం కనీసం స్పందించటం లేదన్నారు. ఈ పర్యటనలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తాతా భాస్కర్‌రావు, సీపీఐ(ఎం) వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరావు, తల్లాడ మండల కార్యదర్శి ఐనాల రామ లింగేశ్వరరావు, సిరిపురం సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శి చింతనిప్పు చంద్రారావు, గుట్టుపల్లి వెంకటయ్య, రుద్రాక్షల వెంకటయ్య, శ్రీనివాసరావు సత్యం, రాంబాబు, కళ్యాణం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.