Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నాచౌక్ వద్ద సెబీకి వ్యతిరేకంగా సహారా కార్మి కులు, ఇన్వెస్టర్లు భారీ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ.. ''సహారా కార్మికులమైన మేము, ఇన్వెస్టర్లు గత 25-30 ఏండ్లుగా ఏదో ఒక పథకం ద్వారా సహారా ఇండియాతో భాగస్వాములమై సంపాదన పొందుతున్నాం. అయితే, సహారా-సెబీ వివాదం కారణంగా గత 8ఏండ్లుగా సుప్రీంకోర్టు సహారా గ్రూపుపై విధించిన ఆంక్షలతో చెల్లింపుల్లో జాప్యం జరిగే పరిస్థితి ఏర్పడింది. ఇది మాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పాత చెల్లింపులు జాప్యం కావడంతో మాకు కొత్త ప్రాజెక్టులు లభించడంలేదు'' అని వెల్లడించారు. అలాగే, ఈ పరిస్థితుల కారణంగా తమ ఆదాయం పడిపోయిందనీ, లక్షలాది మంది కార్మికులు ప్రస్తుతం ఆకలి, నిరుద్యోగం అంచుకు జారుకున్నారని తెలిపారు. గత 8 ఏండ్లుగా సెబీ ప్రకటనలకు వడ్డీతో సహా కేవలం రూ.125 కోట్లను తిరిగి చెల్లించినట్టు సుప్రీంకోర్టుకు ఈ ఏడాది సమర్పించిన స్టేటస్ రిపోర్టులో అంగీకరించింది. 2018 మార్చి 3న సెబీ ప్రకటనకు ప్రతిస్పందనగా 19,598 ఇన్వెస్టర్ల నుంచి తిరిగి చెల్లింపు దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో సెబీ 16,663 దరఖాస్తులకు గానూ వడ్డీతో సహా రూ.125 కోట్లు చెల్లించింది. అయితే, సెబీ మొండివైఖరి కారణంగా లక్షలాది మంది కార్మికులు అంధకార జీవితాన్ని ఎదుర్కొంటున్నారని నిరసన కారులు పేర్కొన్నారు. ''సెబీ ప్రస్తుతం ఏ ఇన్వెస్టర్‌కు తిరిగి చెల్లించాల్సిన దరఖాస్తులు పెండింగ్‌లో లేనప్పుడు.. తిరిగి చెల్లింపు కోసం వేచివున్న ఇన్వెస్టర్లు లేరని అఫిడవిట్ సమర్పించాలి. సుప్రీంకోర్టు సహారా పై విధించిన ఆంక్షలను ఎత్తివేయడానికి దారితీస్తుం ది. తద్వారా సహారా సెబీ ఖాతా నుంచి రూ.24000 కోట్లు (వడ్డీతో సహా) పొందుతుంది. దీంతో ఇన్వెస్టర్లు, డిపాజిట్లందరికీ రెగ్యులర్ రీపేమెంట్లు చెల్లించే అవకాశముంటుంది'' అని పేర్కొన్నారు.