Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి దాకా తనిఖీలు
- ఆ వెంటనే మరమ్మతులు
- ఏండాకాలంలో నీటిఎద్దడికి చెక్
- ఐదేండ్ల నిర్వహణా ఒప్పందం అమలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మిషన్‌భగీరథ తాగునీటి పథకంలో క్రాష్ప్రోగ్రామ్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈనెల నుంచి మార్చి చివరిదాకా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ఈమేరకు సీఈ నుంచి ఏఈ స్థాయి వరకు డ్యూటీ చార్ట్ విడుదల చేశారు. వచ్చే ఏండాకాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూసేందుకువీలుగా సర్కారు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నది.
ప్రోగ్రామ్ ఏంటి ?
క్రాష్ ప్రోగ్రామ్ పేరిట మిషన్ భగీరథ ప్రాజెక్టు మొత్తాన్ని మరోసారి తనిఖీ చేస్తారు. అంతేగాక గ్రామీణ నీటి సరఫరా పథకం(ఆర్డబ్ల్యూఎస్)లోని ఇతర తాగునీటి వనరులను సైతం పరిశీలిస్తారు. ఈ శాఖ పరిధిలోని అన్ని అంశాలను ఈ సందర్భంగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి తాగునీటి సమస్య రాకుండా అప్రమత్తంగా ఉండేందుకు క్రాష్ ప్రోగ్రామ్ తలపెట్టినట్టు అధికారులు చెబుతున్నారు.
ఏం చేస్తారు ?
క్రాష్ ప్రోగ్రామ్ కింద భగీరథ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో మరోసారి పరిశీలిస్తారు. చిన్న చిన్న లోపాల దగ్గర నుంచి భారీ సమస్యల వరకూ గుర్తించి పరిష్కరిందుకు ప్రయత్నిస్తారు. ఇప్పటికే భగీరథ ప్రాజెక్టులోని మోటార్ల తనిఖీ కార్యక్రమం దాదాపుగా పూర్తయినట్టు అధికారిక సమాచారం. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మిగతా పనులనూ పూర్తిచేస్తారు. ప్రధానంగా భగీరథ పైపులైన్లను తనిఖీ చేస్తారు. అనంతరం గ్రామాల్లోని ఇంట్రా నెట్‌వర్క్‌నూ పరిశీలిస్తారు. వేగంగా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి రాష్ట్రస్థాయి సీఈ నుంచి మండల స్థాయిలోని ఏఈ వరకు కృషిచేయాల్సి ఉంటుంది. ఈమేరకు ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆయా స్థాయి ఉన్నతాధికారుల దగ్గర నుంచి మండలాల పరిధిలోని ఏఈల వరకు డ్యూటీ చార్ట్‌ను అమలుచేయనున్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు దాదాపు పూర్తయిన నేపథ్యంలో చివరి అంకంగా క్రాష్ ప్రోగ్రామ్ కార్యక్రమం కీలకమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అలాగే సంపులతోపాటు ఓహెచ్‌బీఆర్‌లు, జీఎల్బీఆర్లు కడగాల్సి ఉంది. నల్లాలు ఎలా ఉన్నాయి ?వాల్వునూ పరిశీలించడం ? కొత్త ఇండ్లకు కనెక్షన్లు ఇవ్వడం తదితర పనులను ఈ సందర్భంగా చేపడతారు. ఇదంతా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 మండలాల్లోని 26 భగీరథ సెగ్మెంట్లల్లో చేపట్టాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ. 45 వేల కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే అందులోనుంచి సుమారు రూ.35 కోట్లదాకా ఖర్చుపెట్టింది. ప్రాజెక్టు కాంట్రాక్టు పనులు చేపట్టేముందే వర్కింగ్ ఏజెన్సీలకు నిర్వహణా బాధ్యతలను సైతం అప్పగించింది. ఇది తప్పనిసరిగా చేయాలని టెండర్ నిబంధనల్లో పేర్కొన్నది. కాంటాక్ట్రుకు సంబంధించిన పని పూర్తయిన తర్వాత ఐదేండ్లపాటు ఆ పనులకు సంబంధించిన మరమ్మతులు సైతం చేయాల్సిన బాధ్యత వర్కింగ్ ఏజెన్సీదే. ఈనేపథ్యంలో క్రాష్ ప్రోగ్రామ్‌లో కాంట్రాక్టర్లూ కీలకం కానున్నారు. తాగునీటి నాణ్యతను సైతం పరీక్ష చేస్తారు. అలాగే ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
వెబ్సైట్లో నమోదు
క్రాష్ ప్రోగ్రామ్‌లో చేసే ప్రతి పనిని మిషన్ భగీరథ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. మోటార్ల తనిఖీ దగ్గర ఉంచి సంపులు, ఓహెచ్‌బీఆర్‌లు, జీఎల్బీఆర్లు, నల్లా ఏర్పాటు, కొత్త ఇండ్లకు కనెక్షన్లు ఇవ్వడం, తాగునీటి నాణ్యత విషయాలను తప్పనిసరిగా వెబ్సైట్లో నమోదు చేసేలా మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం. కృపాకర్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు.