Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు కేసుల్లో కొత్త వేరియంట్
- హైదరాబాద్ నుంచి బెంగాల్ వెళ్లిన బాలుడిలోనూ....
- భయపడాల్సిన అవసరం లేదు...
- కాని అప్రమత్తత అవసరం : డీహెచ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోకి ఒమిక్రాన్ ప్రవేశించింది. సోమాలియా, కెన్యా నుంచి వచ్చిన ఇద్దరిలో కొత్త వేరియంట్ ఉన్నట్టు పరీక్షల్లో వెల్లడైంది. విదేశాల నుంచి వస్తున్న వారికి విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు నిర్వహించటం, పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధంగా జన్యుక్రమ పరీక్షకు పంపించిన నమూనాల్లో కెన్యా, సోమాలియా దేశాల నుంచి వచ్చిన ఇరువురిలో కొత్త వేరియంట్ ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని బుధవారం ఉదయం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు ప్రకటించారు. కాగా కెన్యా నుంచి వచ్చిన మహిళ హైదరాబాద్ లోని టోలిచౌకి ప్రాంతంలో ఉండగా ఒమిక్రాన్ నిర్దారణ కాగానే వెంటనే ఆమెను గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సోమాలియా నుంచి వచ్చిన వ్యక్తి ఆచూకీ దొరకటం లేదని డీహెచ్ తెలిపారు. మధ్యాహ్నం అతడి ఆచూకీ మెహిదీపట్నం సమీపంలోని పారామౌంట్ కాలనీలో దొరికినట్టు, అనంతరం టిమ్స్‌కు తరలించినట్టు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
కెన్యాకు చెందిన 24 ఏండ్ల మహిళ ఈ నెల 12వ తేదీన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారనీ, అప్పుడు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా వచ్చింది. ఆమెకు నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలో బుధవారం ఉదయం ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్టు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ టోలిచౌకిలో ఆమెను గుర్తించి గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించినట్టు చెప్పారు. బాధిత మహిళకు సన్నిహితంగా ఉన్న ఇద్దరు కుటుంబ సభ్యుల నమూనాలను సేకరించి కరోనా నిర్దారణ కోసం ఆర్టీపీసీఆర్ పరీక్షకు పంపించామనీ, అందులో పాజిటివ్ వస్తే వారి నమూనాలను ఒమిక్రాన్ నిర్దారణ కోసం జీనోమ్ సీక్వెటన్సింగ్ కోసం పంపిస్తామని తెలిపారు. ఇక సోమాలియాకు చెందిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్టు నిర్దారించారు. అతను తన తండ్రి వైద్యం కోసం హైదరాబాద్‌కు వచ్చారు. వైద్యం కోసం వచ్చిన బాధితుడు, కుటుంబ సభ్యులు పారామౌంట్ కాలనీలో అద్దెకు ఉంటు న్నారు. తండ్రి కొడుకులిద్దరు వైద్యం కోసం నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో బాధితుడి తండ్రి నమూనాలను కూడా తీసుకుని పరీక్షల కోసం పంపించారు. కాలనీలో చుట్టుపక్కల ఉన్న కుటుంబాల సభ్యుల నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నామని డీహెచ్ తెలిపారు.
మూడో వ్యక్తికి వచ్చినా......
విదేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఏడేండ్ల బాలుడికి కూడా ఒమిక్రాన్ సోకినట్టు అధికారులు గుర్తించారు. అయితే ఆ బాలుడు శంశాబాద్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అక్కడి నుంచే దేశీయ విమానంలో పశ్చిమ బెంగాల్ వెళ్లడంతో సంబంధిత రాష్ట్ర అధికారులకు సమాచారాన్ని చేరవేశామని డీహెచ్ తెలిపారు.
కోవిడ్ నిబంధనలు పాటించాలి....
ప్రజలను ఒమిక్రాన్ బారిన పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. అదే సమయంలో ప్రజలు మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించటం, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోకపోవటం, జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండటం తదితర జాగ్రత్తలను విధిగా పాటించాలని కోరారు. ముఖ్యంగా ఇతర వ్యాధులతో బాధపడే వారు మరింత జాగ్రత్తగా ఉండటం మేలని సూచించారు.