Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ పాఠ్యాంశాలను సీబీఎస్ఈ నుంచి తొలగించాలి
- జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలి : ఎస్టీఎఫ్ఐ కేంద్ర కార్యవర్గం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత రాజ్యాంగాన్ని తుంగలోతొక్కి మనుస్మృతిని మళ్లీ ఆచరణలో పెట్టేందుకు జరుగుతున్న పెద్దకుట్రే సీబీఎస్ఈ సిలబస్లో మహిళల ఎదుగుదలపై చేసిన వ్యాఖ్యలని భారత పాఠశాల ఉపాధ్యాయుల సమాఖ్య (ఎస్టీఎఫ్ఐ) కేంద్ర కార్యవర్గ సమావేశం పేర్కొంది. ఆయా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిం చింది. మహిళలను కించపరిచే ఆ పాఠ్యాంశాలను తొలగించాలని డిమాండ్ చేసింది. రెండురోజులపాటు జరిగే ఎస్టీఎఫ్ఐ జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఎస్టీఎఫ్ఐ కేంద్ర కార్యవర్గ సమావేశం ఆ సంఘం అధ్యక్షుడు అభిజిత్ ముఖర్జీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎస్టీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి సిఎన్ భారతి మాట్లాడుతూ విద్యా విషయక పాఠ్యాంశాల్లో ఆధిపత్య, అహంకార భావజాలాలను ప్రవేశపెట్టి మహిళలను కించపరుస్తూ అన్ని సమస్యలకూ మూలం మహిళలే అని ప్రచారం చేయడం అప్రజాస్వామిమని విమర్శించారు. రాజ్యాంగ మౌలిక లక్ష్యమైన లింగ సమానత్వాన్ని గౌరవించే అంశాలకు పాఠ్యాపుస్తకాల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యా కేంద్రీకరణ, వ్యాపారీకరణలకు ఆస్కారం కల్పిస్తున్న జాతీయ విద్యా విధానం-2020ని సమూలంగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జాతీయత పేరుతో పాఠశాలల స్థాయిలో విద్యార్థుల పసి మెదళ్లను కలుషితం చేసి ప్రజలమధ్య ఐక్యతకు చిచ్చుపెట్టేలా కేంద్ర పాలకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కోవిడ్ కారణంగా విద్యావ్యవస్థకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. గురువారం జరగనున్న జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించే పలు తీర్మానాలను కార్యవర్గ సమావేశంలో చర్చించి ఆమోదించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఎఫ్ఐ ఉపాధ్యక్షులు చావ రవి, ఎం సంయుక్త, కె రాజేంద్రన్, ఎన్ వెంకటేశ్వర్లు, కోశాధికారి ప్రకాష్ చంద్ర మొహంతి, కార్యదర్శులు కెజె హరికుమార్, మహవీర్ సిహాగ్, బదరున్నీసా, బదురుద్దోజా ఖాన్, కెపి భట్టాచార్య, అరుణకుమారి, ఎస్ మైల్, సుకుమార్ పైన్, సుకాంత బెనర్జీ, హరిసింగ్, రేమండ్ ప్యాట్రిక్, శంకర్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.