Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ర్యాంకుల్లో కింది నుంచి ఐదో స్థానం
- అత్యధికంగా పంజాబ్లో రూ.26,701, హర్యానాలో రూ.22,841
న్యూఢిల్లీ : ఈ దేశంలో వ్యవసాయరంగంపై ఏ రాష్ట్రమూ చేయనంతగా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నామని తెలంగాణ పాలకులు చెబుతున్నమాటలు వాస్తవదూరమని తాజా గణాంకాలు చెబుతున్నాయి. రైతు కుటుంబాల సగటు నెల ఆదాయంలో తెలంగాణ అట్టడుగున ఐదో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో రైతుల సగటు నెల ఆదాయం రూ.9403 మాత్రమే ఉందని పార్లమెంట్లో కేంద్రం గణాంకాల్ని విడుదల చేసింది. వరి ధాన్యాన్ని సేకరిస్తారా? లేదా?అంటూ ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగినవేళ కేంద్రం ఈ గణాంకాల్ని విడుదల చేయటం గమనార్హం. జులై 2018-జూన్ 2019 మధ్యకాలానికి వ్యవసాయ కుటుంబాల ఆదాయ వివరాల్ని కేంద్రం సేకరించింది. రైతు కుటుంబాల సగటు నెల ఆదాయంలో ఒడిషా రూ.5112తో అన్నింటికన్నా దిగువన ఉంది. ఆ తర్వాత స్థానాల్లో పశ్చిమబెంగాల్(రూ.6762), బీహార్ (రూ.7542), ఉత్తరప్రదేశ్ (రూ.8061), తెలంగాణ(రూ.9403) ఉన్నాయి. మొదటి స్థానంలో పంజాబ్(రూ.26701), రెండోస్థానంలో హర్యానా(22,841) నిలిచాయి. తెలంగాణలో రైతు కుటుంబాల సగటు ఆదాయం జాతీయ సగటు రూ.10,281 కన్నా తక్కువగా ఉందని తేలింది. రాష్ట్ర బడ్జెట్లో 13.5శాతం వ్యవసాయరంగానికి కేటాయిస్తున్నా, తెలంగాణలో ఈ రీతిగా ఫలితాలు రావటం చర్చనీయాంశమైంది. పంట సాగుపై పెట్టుబడి వ్యయం తెలంగాణలో అత్యధికంగా ఉందని, అందువల్లే రైతుల ఆదాయాలు పడిపోయాయని నిపుణులు భావిస్తున్నారు. పంజాబ్లో ప్రతి వ్యవసాయ కుటుంబానికి సగటున 7.5 ఎకరాల భూమి ఉందని, ఆదాయం ఎక్కువగా ఉండటానికి ఇది ఒక ప్రధాన కారణమని నిపుణులు గుర్తుచేస్తున్నారు. తెలంగాణలో ఒక వ్యవసాయ కుటుంబానికి సగటున 2.5 ఎకరాల భూమి ఉందని వ్యవసాయ శాస్త్రవేత్త రామాంజనేయులు తెలిపారు.