Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు, రేపు సమ్మెను జయప్రదం చేయండి : యూఎఫ్‌బీయూ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన బ్యాకింగ్ చట్టాల సవరణ బిల్లు-2021ను ఉపసంహరించుకోవాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) డిమాండ్ చేసింది. బుధవారంనాడిక్కడి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతృత్వంలోని యూఎఫ్‌బీయూ తెలంగాణ రాష్ట్ర శాఖ కన్వీనర్ ఆర్ శ్రీరాం, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బెఫీ) ప్రధాన కార్యదర్శి పి వెంకట్రామయ్య, అలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్(ఏఐబీఓసీ) ప్రధాన కార్యదర్శి జీ నాగేశ్వర్, ఏ సాయిప్రసాద్ (ఏఐబీఓసీ), టీ వెంకట స్వామి (ఐఎన్‌బీఈఎఫ్) తదితరులు మాట్లాడారు. సవరణ బిల్లును రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టి, ఆమోదం పొందాలని కేంద్రప్రభు త్వం ప్రయత్నిస్తున్నదనీ, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే పలురూపాల్లో అందోళనలు చేపట్టామనీ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రానందున ఈ డిమాండ్ పరిష్కారం కోసం గురు, శుక్ర వారాల్లో (16, 17న) జాతీయ స్థాయిలో బ్యాంకర్ల సమ్మె చేపడుతున్నట్టు తెలిపారు. దీన్ని బ్యాంకు ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా సమర్థించాలని విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే ఉద్యోగులకంటే ప్రజలకే ఎక్కువ నష్టం జరుగుతుందని వివరించారు. జాతీయ బ్యాంకుల్లోని 13 మంది కార్పొరేట్ ఖాతా దారులు రూ.4,46,800 కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉండగా, రూ. 1,61,820 కోట్లు సెటిల్ చేసుకున్నారనీ, మిగిలిన రూ.2,84,980 కోట్లు బ్యాంకులు నష్టపోయాయని చెప్పారు. రుణ ఎగవేతదారులపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టి, జైళ్లకు పంపలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ బ్యాంకుల సామాజిక బాధ్యతగా పేదలకు జన్‌థన్ ఖాతాల ద్వారా బ్యాంకింగ్ సౌకర్యాన్ని కల్పించాయని గుర్తుచేశారు. ప్రభుత్వబ్యాంకుల్లో సర్వీసులోపం ఏర్పడటానికి ప్రభుత్వమే కారణమనీ, నలుగురు చేయాల్సిన పనుల్ని ఒక్కరితోనే చేయిస్తూ, ప్రభుత్వ పథకాలన్నింటినీ వారిపైనే రుద్దుతున్నారని చెప్పారు.