Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుసగా పార్టీ కార్యక్రమాలు...
- జిల్లాల్లో సమావేశాలు.. టీఆర్ఎస్ ఆఫీసుల ప్రారంభోత్సవాలు : సీఎం కేసీఆర్
- రేపు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటి
- శనివారం దళిత బంధుపై కలెక్టర్లతో సమీక్ష
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హుజూరాబాద్ ఉప ఎన్నిక గెలుపుతో దూకుడు మీదున్న బీజేపీని రాష్ట్రంలో నిలవరించేందుకు వీలుగా పలు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆ స్థానం నుంచి గెలుపొందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. రోజుకో జిల్లా తిరగుతూ బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్న దరిమిలా... ఆయనకు ధీటుగా టీఆర్ఎస్ సీనియర్లు, ప్రజా ప్రతినిధులు కూడా క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ బలోపేతం కోసం కృషి చేయాలంటూ ఆదేశించారు. ఈ క్రమంలో మొదట తానే పార్టీ జిల్లా కార్యాలయాలు, కలెక్టరేట్ల ప్రారంభోత్సవాల కోసమంటూ పలు జిల్లాల్లో పర్యటిస్తానని వారికి తెలిపారు. అక్కడ సభలు, సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అందుకనుగుణంగా ఆయన జిల్లాల పర్యటన ఖరారైంది. తమిళనాడు పర్యటన ముగించుకుని బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంబంధిత షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించే ఈ సమావేశానికి జిల్లా పరిషత్ చైర్మెన్లు, డీసీఎమ్ఎస్, డీసీసీబీ అధ్యక్షులు, రైతు బంధు జిల్లా అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మెన్లు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సైతం హాజరు కావాలంటూ కేసీఆర్ ఆదేశించారు.
శనివారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో కలెక్టర్లతో నిర్వహించబోయే సమావేశంలో దళిత బంధు, ఇతర అంశాలపై కలెక్టర్లతో... సీఎం సమీక్షించనున్నారు. రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తోపాటు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. మార్చిలోపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధును అమలు చేయటమనే అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు, ప్రజా ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాల నిర్వహణపై కూడా చర్చించి, నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ధాన్యం సేకరణ అంశంపై వ్యవసాయ శాఖాధికారులతో సీఎం చర్చిస్తారు.
జిల్లాల పర్యటనలు...
సీఎం ఈనెల 19న వనపర్తి జిల్లాకు వెళతారు. అక్కడి కలెక్టరేట్‌ను ఆయన ప్రారంభిస్తారు. వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారు.
20న జనగామ జిల్లాలో పర్యటిస్తారు. అక్కడి కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
వీటితోపాటు సీఎం... మరికొన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయా తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని ఉమామహేశ్వర లిఫ్టు, రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేస్తారు. అక్కడి వంద పడకల ఆస్పత్రిని ప్రారంభిస్తారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా అక్కడి కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. ఇదే మాదిరిగా జగిత్యాల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ కలెక్టరేట్లతోపాటు అక్కడి టీఆర్ఎస్ కార్యాలయాలను ఆయన ప్రారంభిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు.