Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కార్పొరేట్ కాలేజీలకు లాభం చేకూర్చడం కోసమే ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను ఇంటర్ బోర్డు నిర్వహించిందని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) విమర్శించింది. ఈ మేరకు టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, నగేశ్, రహీం, సమన్వయకర్త ఎం జంగయ్య గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయివేటు, కార్పొరేట్ కాలేజీలున్న జిల్లాల్లో ఉత్తీర్ణత శాతం పెరిగిందని వివరించారు. ప్రత్యక్ష బోధన లేకుండా ఆన్లైన్ సౌకర్యం లేని పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత తగ్గిందని తెలిపారు. దీంతో వాటిలో చదివిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఈ అంశాన్ని గతంలో ఇంటర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తెలిపారు. దీనికి ఇంటర్ బోర్డు అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాల ద్వారా ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థుల భవిష్యత్తు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలని సూచించారు.