Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోరుకున్న వారిని పరీక్షకు అనుమతించాలి: టీపీఏ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో చాలా తక్కువగా 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) తెలిపింది. ఉత్తీర్ణులైన వారిలోనూ చాలా మందికి తక్కువ మార్కులొచ్చాయని పేర్కొంది. ఫెయిలైన విద్యార్థులందరికీ పాస్ మార్కులివ్వాలని టీపీఏ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ నారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్ పద్మారెడ్డి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విద్యార్థుల్లో ఎవరైనా పరీక్షలు రాయాలనుకుంటే వారిని అనుమతించాలని సూచించారు. ఇంటర్ ఫస్టియర్లో ఫెయిలైన విద్యార్థులు సెకండియర్ చదువుతున్నారనీ, వారిని ఇంటర్ బోర్డు ఏం చేయదల్చుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కోవిడ్ కంటే ముందు సంవత్సరాల్లో వచ్చిన ఫలితాల కంటే ఇప్పుడు దాదాపు పది శాతం కంటే తక్కువగా వచ్చాయని తెలిపారు. పదో తరగతిలో పదికి పది జీపీఏ వచ్చిన విద్యార్థులూ ఫెయిలైన వారిలో ఉన్నారని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో పరీక్షలను విద్యార్థులు రాయలేరని చెప్పిన వినకుండా పరీక్షలు నిర్వహించడం బోర్డు బాధ్యతారహితానికి నిదర్శనమని విమర్శించారు. ఫెయిలైన విద్యార్థుల్లో ఒత్తిడిని నివారించడానికి చర్యలు చేపట్టాలని కోరారు.