Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీ చేస్తా
- సీఎం..నీకూ, నాకూ రైతు బంధు అవసరమా?
- నేనెప్పటికీ వామపక్షభావజాలం ఉన్న వ్యక్తినే : టీజేయూ మీట్‌ది ప్రెస్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజానీకానికి ఎంతో ఉపయోపగపడుతూ సంపద సృష్టి, ఉద్యోగ కల్పనలో ముందు వరుసలో ఉన్న ఎల్ఐసీ, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకే కేంద్ర ప్రభుత్వం వాటిని ప్రయివేటీకరిస్తున్నదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయాలనే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. వచ్చేసారి కూడా ప్రజల ఆశీస్సులతో హుజూరాబాద్ నుంచే బరిలోకి దిగుతాననీ, బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌పైనా పోటీచేస్తానని స్పష్టం చేశారు. థర్డ్ ఫ్రంట్ ఏమోగానీ..ముందు రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దుకోవాలని కేసీఆర్‌కు హితవు పలికారు. గురువారం హైదరాబాద్‌లోని సెంట్రల్ కోర్ట్ హోటల్లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో మీట్‌ది ప్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ..తాను తెలంగాణ ఉద్యమంలో చురుగా పనిచేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన బిడ్డనని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీని తాను వీడలేదనీ, సవాళ్లు విసిరి మరీ రెచ్చగొట్టి రాజీనామా చేసేలా వ్యవహరించా రని తెలిపారు. రాష్ట్ర సర్కారు ఎన్ని కుట్రలు చేసినా..కోట్లాది రూపాయలు పంచినా హుజూరా బాద్ ప్రజలు తనను ఆదరించి గెలిపించారన్నారు. ఇప్పటికీ తాను వామపక్ష భావజాలమున్న వ్యక్తినేనని నొక్కిచెప్పారు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, గుంట భూమి లేని పేదల కోసం రాష్ట్రంలో పథకాలు లేకపోవడం బాధాకరమని ఈటల వ్యాఖ్యానించారు. అర్హులైన రైతులకు రైతుబంధు ఇవ్వడం ఓకేగానీ.. వంద లెకరాలున్న భూస్వాములకు, సీఎంకీ, తనకూ ఆ పథకం అవసరమా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు చెమట చిందించి పన్నులు కట్టడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇష్టానుసారంగా పంచిపెట్ట డం ఏంటని నిలదీశారు. రేవంత్‌రెడ్డితో జట్టుకట్టినట్టు, బండి సంజరుతో విభేదాలున్నట్టు విషప్రచారాన్ని కేసీఆర్ టీం చేస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ ప్రశ్నించే చైతన్యాన్ని తట్టుకోలేరన్నారు. అందులో భాగంగానే, క్షేత్ర స్థాయిలో పాలకుల విధానాలను ఎండగట్టి ప్రజల్లో ఉండే చిన్న పత్రికలకు పూర్తిగా ప్రకట నలను నిలిపివేసి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టారనీ, పెద్దపత్రికలనూ తన గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ జర్నలిస్టులకూ అనేక హామీలిచ్చి మోసం చేశారన్నారు. మెజార్టీ ప్రాంతీయ పార్టీల్లో ప్రజాస్వామ్యం ఉండదనీ, కుటుంబానికే ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. పార్టీల నాయకులపై కేసులు పెడుతుండటంతో రైతులు, ప్రజలే నేరుగా రోడ్లమీదకొచ్చి ఆందో ళనలు చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొం దన్నారు. ఈ మీట్‌ది ప్రెస్‌లో తెలంగాణ జర్నలిస్టు యూని యన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.