Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కార్మికులను అక్కున చేర్చుకున్నాం
- గతంలో 3,4 నెలలకూ జీతాలు రాని పరిస్థితి
- తెలంగాణ ప్రభుత్వం ప్రతినెలా రూ.12 వేల జీతం ఇస్తోంది
- సంగారెడ్డిలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
మున్సిపాలిటీలో పనిచేసే సఫాయి కార్మికులను అక్కున చేర్చుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని బైపాస్ రోడ్డులో రూ. 6.70 కోట్ల వ్యయంతో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో మున్సిపల్ కార్మికులకు మూడు నాలుగు నెలల వరకూ జీతాలు రాని పరిస్థితి ఉండేదనీ, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 'సఫాయన్న నీకు సలాం' అన్నది ముఖ్యమంత్రి కేసీఆరేనని గుర్తు చేశారు. మున్సిపల్ సఫాయి కార్మికులకు ఇబ్బంది కలగకుండా ప్రతినెలా టంచన్‌గా మొదటి వారంలోనే జీతాలు ఇస్తున్నారన్నారు. వారి జీతాలను రూ.12 వేలకు పెంచారని గుర్తుచేశారు. సఫాయి కార్మికులకు సలామ్ కొట్టడమే కాకుండా పట్టణాలు, పల్లెలు పరిశుభ్రంగా ఉంచే విధంగా వారిని ఉత్తేజపరుస్తున్నామని తెలిపారు. ప్రతినెలా మొదటి వారంలో సంగారెడ్డి పట్టణానికి రూ.15.31 కోట్లు, సదాశివపేట పట్టణానికి 7.95 కోట్లు, జహీరాబాద్‌కు 16.09 కోట్లు నిధులు విడుదల చేస్తున్నామన్నారు. వారం, పది రోజుల్లో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాల్టీకు రూ.50 కోట్ల నిధులను విడుదల చేస్తామన్నారు.