Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రాన్స్‌కో, జెన్కో చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు టీఎస్‌యూఈఈయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ కమిటీని వేయాలని తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్(టీఎస్‌యూఈఈయూ హెచ్-1829) డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని విద్యుత్‌సౌధలో టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్‌రావుకు వినతిపత్రాన్ని ఆ యూనియన్ నేతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూఈఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.గోవర్ధన్, రాష్ట్ర అధ్యక్షులు వి.కుమారచారి, కార్యనిర్వాహక కార్యదర్శులు మురళి, వై.విక్రమ్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సాంబయ్య, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..30.04.2018 చేసుకున్న ఉద్యోగుల వేతన సవరణ, ఒప్పందం 2022 మార్చి 31తో ముగిస్తుందని తెలిపారు. టీఎస్ ట్రాన్స్‌కో, టీఎస్ జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు, ఆర్టిజన్, అన్ని రకాల కార్మికులకు సంబంధించిన 2022 వేతన సవరణ కమిటీని వెంటనే వేయాలని కోరారు.
టీఎస్‌పీఈయూ-1535 ఆధ్వర్యంలోనూ..
తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్- 1535 (టీఎస్‌పీఈయూ-1535) సెంట్రల్ కమిటీ అధ్యక్షులు ఎ.వజీర్, టీఎస్ ట్రాన్స్‌కో అధ్యక్షులు నగేశ్, టీఎస్‌పీఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ తఖీ, రాష్ట్ర నాయకులతో కూడిన బృందం టీఎస్ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, ట్రాన్స్‌కో జేఎమ్డీ శ్రీనివాస్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. పీఆర్సీ కమిటీ వేయాలనీ, ఈపీఎఫ్ టూ జీపీఎఫ్ సమస్యను పరిష్కరించాలని కోరారు.