Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజావేదికలో ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించకపోవడం సరైందికాదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. వ్యవసాయంలో వారి పాత్ర గణనీయంగా ఉందని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించేందుకు కుట్ర జరుగుతున్నదన్నారు. భూమి ఎక్కడుందో తెలియని వాళ్లకు, ఒక్క రోజు కూడా వ్యవసాయం చేయని వాళ్లకు రైతు బంధు ఇస్తున్నారు, కానీ కౌలుదారులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్ట పోతే పరిహారం వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద రైతు స్వరాజ్యవేదిక ఆధ్వర్యంలో 250 మంది రైతుఆత్మహత్య బాధిత కుటుంబాలతో ప్రజావేదిక నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా రైతుల కుటుంబాలకు సహాయం అందేవరకు పోరాటం చేస్తామన్నారు. జాతీయ రైతు హక్కుల కార్యకర్త కవిత కురుగంటి మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రత్యేక జీవో ప్రకారం రూ ఐదు లక్షలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. భర్త చనిపోతే భూమి హక్కులు భార్యకు వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కౌలు రైతుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే, ఢిల్లీ తరహాలో రాష్ట్రంలో ఉద్యమం తప్పదన్నారు. దళిత స్త్రీ శక్తి కన్వీనర్ గడ్డం ఝాన్సీ మాట్లాడుతూ అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదనవ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అంటున్న కేసీఆర్కు రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
జీవో 194 అమలైతే రాష్ట్రంలో ఏడువేల మందికి పరిహారం అందుతుందన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ సామాన్య రైతును ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరముందన్నారు. బీజేపీ,టీఆర్ఎస్ పార్టీలు రాజకీయాల కోసం రైతులను రచ్చకీడుస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక నాయకులు విస్సాకిరణ్, కన్నెగంటి రవి, బి కొండల్, బీర రాములు తదితరులు మాట్లాడారు.