Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపటి నుంచి హైదరాబాద్ బుక్‌ఫెయిర్
- ఈ నెల 28 వరకు నిర్వహణ
- కొలువుదీరనున్న వేలాది గ్రంథాలు
- సాహితీ సదస్సులతో వేడుకలు
- కోవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహణ
- 250 స్టాళ్లతో ప్రదర్శన : విలేకర్ల సమావేశంలో బుక్‌ఫెయిర్ అధ్యక్షులు జూలూరి గౌరీ శంకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శన(బుక్ ఫెయిర్- 34వ ప్రదర్శన) ను శనివారం నుంచి ఈ నెల 28వరకు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. జ్ఞాన తెలంగాణ లక్ష్యంగా ప్రారంభమయ్యే ఈ ప్రదర్శన వేలాది పుస్తకాలతో కొలువుదీరనున్నది. ఒమిక్రాన్, కరోనా మూడో అల నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను పక్కాగా పాటిస్తూ బుక్‌ఫెయిర్ నిర్వహించనున్నారు. ఇక్కడకొచ్చే పుస్తక ప్రియులు కూడా విధిగా కరోనా నిబంధనలను పాటించాలంటూ బుక్‌ఫెయిర్ అధ్యక్షులు జూలూరి గౌరీ శంకర్ విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ప్రధాన కార్యదర్శి కోయ చంద్రమోహన్‌తో కలిసి ఆయన పుస్తక ప్రదర్శన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా గౌరీ శంకర్ మాట్లాడుతూ తెలంగాణ అవిర్భావం తర్వాత బుక్‌ఫెయిర్‌కు ప్రాముఖ్యత పెరిగిందన్నారు. రాష్ట్రంలో కోటి మంది విద్యార్థులు పుస్తక పఠనం చేస్తే..జ్ఞాన తెలంగాణ దిశగా ప్రయాణం చేసినట్లేనని చెప్పారు. రాబోయే తరానికి సామాజిక ధృక్పదాన్ని అందించటమే ఈ బుక్ ఫేయిర్ ప్రధాన లక్ష్యమని వివరించారు. ముప్పై రకాల యక్షగానాల్లో ప్రాముఖ్యత సంతరించుకున్న చిందుఎల్లమ్మ వేదికగా సభాప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. సంగీత సామ్రాట్ నేరెళ్ల వేణుమాదవ్ ప్రాంగణం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈసారి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను నిర్వహించేందుకు కమిటీ సన్నాహాలు చేపట్టిందన్నారు. ఏటా సుమారు 330 నుంచి 350 స్టాళ్లతో జాతీయ స్థాయి పుస్తక ప్రచురణ సంస్థలతో నిర్వహిస్తున్న ప్రదర్శనలో ఈ ఏడాది కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ సందర్శకులు పుస్తక ప్రదర్శనలో పాల్గొనేందుకు వీలుగా 250 స్టాళ్లను మాత్రమే ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కొత్తగా వచ్చే రచయితలకు ప్రత్యేకంగా పుస్తకాల స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వారి ఆర్థిక స్థోమతను దృష్టిలో పెట్టుకుని వారి పుస్తకాలను ప్రమోట్ చేయటం కోసం తగిన విధంగా ప్రొత్సహించాలని భావించినట్టు తెలిపారు. చంద్రమోహన్ మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థల పుస్తకాలను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. విభిన్న జీవన రంగాలకు చెందిన లక్షలాది పుస్తకాల విక్రయాలు జరగడం ఈ బుక్‌ఫేయిర్ ప్రత్యేకతన్నారు.
కథ, కవిత్వం, నవల, చరిత్ర వంటి సాహిత్యమే కాకుండా బాలల సాహిత్యం, పోటీ పరీక్షల పుస్తకాలు ఆర్థిక, రాజకీయ పరిణామాలపై వెలువడిన విశ్లేషణ గ్రంథాలు, వ్యక్తిత్వ వికాసం, అకడమిక్ పాఠ్యపుస్తకాలు వంటి వాటికీ పాఠకాదరణ లభిస్తోందని చెప్పారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9 గంటల వరకు. ఈ ప్రదర్శన ఉంటుందని చెప్పారు. రాజేశ్వర్‌రావు, సృతికాంతరావు, విభాభారతి, నారాయణ రెడ్డి, శోభన్‌బాబు, సూరిబాబు తదితరులు మాట్లాడారు.