Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-దేశం మొత్తంలో దాని అమలును నిలిపేయాలి
- విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి
- పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలి
- మార్చి 5న ఢిల్లీలో విద్యాసదస్సు
- మే 14 నుంచి 16 వరకు విజయవాడలో ఎస్టీఎఫ్ఐ మహాసభలు:
ప్రధాన కార్యదర్శి సిఎన్ భార్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాజంలో అంతరాలు పెంచే విధంగా జాతీయ విద్యావిధానాన్ని రూపొందించిందని భారత పాఠశాల ఉపాధ్యాయుల సమాఖ్య (ఎస్టీఎఫ్ఐ) ప్రధాన కార్యదర్శి సిఎన్ భార్తి విమర్శించారు. జాతీయ విద్యావిధానం అమలును దేశం మొత్తంలో దాన్ని నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఎస్టీఎఫ్ఐ జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాల్లో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ విద్యావిధానం అమల్లోకి వస్తే పాఠశాల స్థాయిలోనే డ్రాపౌట్లు పెరుగుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యకు చేరే వారి సంఖ్య తగ్గుతుందని చెప్పారు. విద్యా కేంద్రీకరణ, వ్యాపారీకరణ, ప్రయివేటీకరణ, కాషాయీకరణకు దోహదం చేసేలా దీన్ని రూపొందించారని విమర్శించారు. దేశవ్యాప్తంగా సర్కారు బడుల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. వాటిని భర్తీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్‌టైం, గెస్ట్ వంటి పేర్లతో ఉపాధ్యాయుల శ్రమ దోపిడీకి ప్రభుత్వాలు పాల్పడుతున్నాయనీ, దీన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. కోవిడ్‌తో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. సామాజిక భద్రతకు శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పింఛన్ (సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. మహిళల పట్ల వివక్ష చూపడం విచారకరమన్నారు. సీబీఎస్ఈ సిలబస్‌లో మహిళలను కించపరిచేలా ఉన్న పాఠ్యాంశాలను తొలగించాలని కోరారు. రైతాంగం ఐక్యతతో ఏడాదికిపైగా పోరాటం చేయడంతో మూడు నల్ల చట్టాలను మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని చెప్పారు. రైతులకు తామెపప్పుడూ అండగా ఉంటామన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు ఫిబ్రవరి 23,24 తేదీల్లో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు, బ్యాంకు ఉద్యోగులు, అధికారులు చేపట్టిన సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. మార్చి 5న ఢిల్లీలో జాతీయ విద్యాసదస్సు నిర్వహిస్తామన్నారు. ఎస్టీఎఫ్ఐ ఎనిమిదో జాతీయ మహాసభలు మే 14,15,16 తేదీల్లో విజయవాడలో నిర్వహించాలని జనరల్ కౌన్సిల్ నిర్ణయించిందని వివరించారు.
సీబీఎస్ఈ సిలబస్‌లో అప్రజాస్వామిక అంశాలను తొలగించాలి : సంయుక్త
సీబీఎస్ఈ సిలబస్‌లో అప్రజాస్వామిక అంశాలను తొలగించాలని ఎస్టీఎఫ్ఐ ఉపాధ్యక్షులు, జాతీయ మహిళా ఉపాధ్యాయుల ఫోరం (ఎన్ఎఫ్డబ్ల్యూటీ) చైర్పర్సన్ ఎం సంయుక్త డిమాండ్ చేశారు. భర్త మాటకు విలువనివ్వని భార్యల కారణంగా కుటుంబాల్లో పిల్లలు దారితప్పుతు న్నారనీ, క్రమశిక్షణ లోపిస్తున్నదనీ, కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయనీ, స్త్రీలకు అతిస్వేచ్ఛ లభించడమే దీనికి కారణమంటూ సీబీఎస్ఈ పదో తరగతి ఆంగ్ల పరీక్ష ప్రశ్నాపత్రంలో ఒక పేరాగ్రాఫ్ ఉందని వివరించారు. మనువాదులు తమ ఆధిపత్యానికి విఘాతం కలుగుతుందని భావించి పాఠ్యాంశాల ద్వారా పిల్లల మెదళ్లను పాడుచేస్తున్నారని విమర్శించారు. ఎన్సీఈఆర్టీలో సంఫ్‌ుపరివార్‌కు చెందిన వారితో పాఠ్యాంశాలను రూపకల్పన జరుగుతున్నదని చెప్పారు. ఇది ఇంతటితో ఆగకపోతే రాష్ట్రాల సిలబస్‌లలోనూ ఈ తరహా అంశాలుండే అవకాశముందన్నారు. జనవరి 3న సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా మహిళలను కించపరిచడాన్ని ఆపేయాలనినే డిమాండ్‌తో కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఎఫ్ఐ ఉపాధ్యక్షులు చావ రవి, కె రాజేంద్రన్, కోశాధికారి ప్రకాష్ చంద్ర మొహంతి, ఎన్ఎఫ్డబ్ల్యూటీ కన్వీనర్ బిదరున్నిసా, కో కన్వీనర్ అరుణకుమారి, టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షుడు కె జంగయ్య, ఉపాధ్యక్షులు దుర్గాభవాని, కార్యదర్శులు వి శాంతికుమారి, ఆర్ శారద, రాష్ట్ర కమిటీ సభ్యులు కల్పన, వందన తదితరులు పాల్గొన్నారు.