Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దదిక్కును కోల్పోయాం..
- కష్టాల ఊబిలో కూరుకుపోయాం
- సర్కారు సాయమందదు.. కష్టాలూ తీరవు
- ఆత్మహత్య బాధిత రైతు కుటుంబాల కన్నీటి గాథలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో అన్నదాతల కష్టాలు చెప్పలేనివి. అందులో ఆత్మ హత్య చేసుకున్న రైతు కుటుంబాల పరిస్థితి మరింత దయనీ యం. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆయా కుటుంబాలు పడే బాధలు వర్ణనాతీతం. సాగుకోసం ప్రయివేటు అప్పుల సుడిగుండంలో ఇరుక్కుపోయి అన్నదాతలు పాడెక్కుతున్నారు. పంటచేతికి రాకపోవడంతోపాటు, అప్పులోళ్ల వెంటపడుతుండ టంతో వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.. కొన్ని చోట్ల వారి దహనసంస్కారాలు కూడా చేయనివ్వని పరిస్థితులున్నాయి. అందులో అత్యధి కంగా కౌలు రైతుల్లోనే ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. కౌలు రైతు మరణిస్తే, ఆ కుటుంబం రోడ్డుపాలవుతున్నది. సొంతభూమిలేదనే సాకుతో ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయి. రైతుబీమా, వితంతు పెన్షన్లు కూడా అందని పరిస్థితులు నెలకొన్నాయి. భర్త చేసిన అప్పులను తీర్చాలంటూ మహిళ లను రచ్చబండకీడుస్తున్న సంఘటనలున్నాయి. అత్తమా మలు, మరుదులు కూడా ఆ మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు. భర్త కోల్పోయి, పిల్లలను పోషించలేక, అప్పు లోళ్ల వేధింపులు భరించలేక ఆ మహిళలు పడుతున్న ఇబ్బం దులు అన్నీ,ఇన్నీ కావు. ఇవి చెప్పుకుని వారు కన్నీరుమున్నీర వుతున్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద రైతు స్వరాజ్యవేదిక ఆధ్వర్యంలో 'రైతు ఆత్మహత్య బాధితులతో ప్రజావేదిక' కార్యక్రమాన్ని నిర్వ హించారు. ప్రొఫెసర్ హరగోపాల్, కవిత కురుగంటి, వి సంధ్య, జి ఝాన్సీ...250 మహిళా రైతుల అభిప్రాయాలను సేకరించారు. దీనికి రైతు స్వరాజ్య వేదిక నాయకులు కన్నె గంటి రవి, కొండల్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు లక్షల పరిహారంగానీ, రైతుబీమా, రైతుబంధు అందడం లేదు, పరిహరమూ ఇవ్వడంలేదంటూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చెందిన మహిళలు తమ బాధలను 'నవతెలంగాణ'తో పంచుకున్నారు. వారి మాటల్లోనే...
మా నాన్న, నా భర్త ఆత్మహత్య : కందుల గీత, జనగాం జిల్లా
'అప్పులెక్కువై మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఆ బాధ మరిచిపోకముందే నా భర్త చనిపోయాడు. ట్రాక్టర్ తోలేవాడు. కౌలుకు పొలం పట్టాం. పంట రాలే. చేసిన అప్పులు తీరదనే ఆందోళనతో పురుగుల మందు తాగి చనిపోయాడు. పిల్లలను వదిలేసి పొమ్మంటున్నారు. ఇంకా ఫించన్ కూడా రాలే'
అప్పులోళ్ల బాధలు భరించలేకే : సునీత, బచ్చన్న పేట
'నా భర్త అప్పులోళ్ల సూటిపోటి మాటలు బరించలేకే చనిపోయారు. మూడున్నర లక్షలతో బోర్లువేశాం. నీళ్లు పడ లేదు. బంగారం తాకట్టు పెట్టినం. అప్పులు తీరవు. పోయిన బంగారం తిరిగి రాదు. అని చెప్పి మదనపడేవాడు. మామిడి చెట్టుకు ఊరేసుకున్నారు.
కౌలు పొలంలో పత్తి పండలేదు' : గీత, సిరిసనగండ్ల, కొండపాక
'సొంత భూమిలో మూడు బోర్లు వేసి అప్పులపాలయ్యాం. అవి తీర్చేందుకు భూమి కౌలుకు తీసుకుని పత్తి పంటేశాం. అప్పులకోసం సొంత భూమిఅమ్ముకున్నాం. అయినా అప్పు లు తీరలేదు.దీంతో ఆయన పురుగుల మందు తాగారు.నేను బీడీలు చుట్టి బతుకున్నాను. ఏ సాయమూ లేదు'.
అప్పులకు తండ్రీకొడుకులు బలి : సావద పద్మ, మాధారం గ్రామం
'మాకు మూడెకరాల రాళ్ల పొలం ఉంది. వానలు పడితే పండుతుంది. లక్ష రూపాయలు పెట్టి రెండు ఎడ్లు కొన్నాం. వాటితో కౌలు పొలం దున్నాం. కానీ పంట పండలేదు. ఎడ్లకు మేత కరువైంది. మొత్తంగా ఆరు లక్షలు అప్పయింది.దీంతో తండ్రీ చనిపోయాడు. ఆ అప్పులు తీర్చలేనంటూ నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు'.
ఎక్కడ కలిసినా బాకీలే అడిగేటోళ్లు : కె లక్ష్మిదేవమ్మ, పెద్దనంది గ్రామం
'నా భర్త బోర్ల కోసం అప్పులు తెచ్చాడు, నీళ్లు పడలేదు. మూడు రూపాయల మిత్తికి బాకీలు తెచ్చినం. మాఆయన ఎక్కడ కలిసినా అప్పులోళ్లు బాకీలు అడిగేవారు. తట్టులేకపోయేవాడు. పురుగులు మందు తాగి ఇంటికి వచ్చాడు. ఆస్పత్రికి తీసుకపోతుంటే మధ్యలోనే చనిపోయాడు. ఇప్పటికీ అప్పులోళ్లు నన్ను వేధిస్తూనే ఉన్నారు. మిత్తిలేకపోయినా అసలు కట్టాలని అడుగుతున్నారు'.
పదేఎకరాలకు ఐదు లక్షల అప్పు : పంతుల లక్ష్మి, బండపల్లి గ్రామం
'మాది ఐదెకరాల సొంతభూమి, ఐదెకరాలు కౌలు పొలం. పత్తి, వరి,మక్కలు వేశాం. పెట్టుబడి ఐదు లక్షలైంది. పంటలు ఎండిపోయాయి. పెట్టిన పెట్టుబడి రాలే. పరిహారమూ రాలే. 2015 నుంచి అందర్ని అడుగుతున్నా..న్యాయం జరగలే.
ప్రయివేటు అప్పులకు చనిపోతే పరిహారం లేదట' : సోమల్ల సరిత, జనగాం
'రూ రెండు లక్షలు పెట్టిబోర్లు వేశారు. నీళ్లు పడలేదు. అప్పు తీర్చే పరిస్థితి లేదు. పత్తేసినా పంటచేతికి రాలే. ప్రయివేటు అప్పులతో ఆయన చనిపోతే పరిహారం రాదంటూ తహసీల్ధారు చెబుతున్నారు. నేను ఇప్పుడు రైస్‌మిల్లులో పని చేసి పిల్లలను సాదుతున్నా.