Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకుల పరిరక్షణ దేశానికి అవసరం
- ప్రజా పోరాటానికి మోడీ వెనక్కి తగ్గాల్సిందే : వక్తలు
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణతో ప్రజాధనానికి భద్రత లేకుండా పోతుందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని పరిరక్షించుకోవటం దేశానికే అవసరమని వ్యాఖ్యానించారు. ప్రజా పోరాటానికి మోడీ సర్కారు తలొంచక తప్పదని, ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తీరుతుందని తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా పోరాడిన రైతులు విజయాన్ని సాధించారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో బ్యాంకుల పరిరక్షణ కోసం ఉద్యోగులు పోరాడాలని సూచించారు. ఇది కేవలం ఉద్యోగుల సమస్య మాత్రమే కాదనీ, ప్రజలు, దేశానికి సంబంధించిన అంశమని తెలిపారు. బ్యాంకుల ప్రయివేటీకరణ కుట్రకు ఉద్యోగులతోపాటు ప్రజలు కూడా బాధితులే అని చెప్పారు. రైతుల మాదిరిగా బ్యాంకు ఉద్యోగులు సైతం ప్రయివేటీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే అంశంపై ప్రజలకు, ముఖ్యంగా తమ ఖాతాదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. బ్యాంకుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్బీయూ) దేశవ్యాప్తంగా గురు, శుక్రవారాలు రెండు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేశారు. వారికి పలు ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపాయి. కాగా గురువారం కోఠిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో సభకు ఆ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఆర్.శ్రీరాం అధ్యక్షతన వహించారు. వందలాది మంది ఉద్యోగులు, సిబ్బంది బీజేపీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు.
అమెరికా కోసం మోడీ.....
అమెరికాకు అవసరమైన సేవా రంగాలకు ఊతమిచ్చేందుకే మోడీ సర్కారు ఇండియాలో ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణకు తెర తీసిందని ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. ప్రభుత్వరంగ బ్యాంకులు వచ్చాకే తమ డబ్బులకు పూర్తి భద్రత ఉందనే భావన ప్రజల్లో పెరిగిందని తెలిపారు. ఇప్పటికే పలు ప్రయివేటు బ్యాంకులు దివాళా తీయటం, ప్రజలు పొదుపు చేసుకున్న డబ్బును తిరిగి చెల్లించకపోవటం వంటివి ఉదంతాలున్నాయని గుర్తుచేశారు. ప్రజలు ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడుకుంటేనే అవి ప్రజలను కాపాడుకుంటాయని అభిప్రాయపడ్డారు.
లబ్దిదారులను భాగస్వాములను చేయాలి....
ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణ వ్యతి రేక పోరాటంలో ఆయా బ్యాంకుల లబ్దిదారు లను భాగస్వాములను చేయాలని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ సూచించారు. ఏడాది పాటు పోరాడిన రైతులు వ్యవ సాయ చట్టాలను రద్దు చేయించు కోగలిగారని తెలి పారు. ఉప ఎన్నికల్లో ఓడించిన ప్రజలు పెట్రోల్ ధర లు తగ్గించగలిగారని గుర్తు చేశారు. ధర్నాచౌక్ అవస రమే లేదన్నకేసీఆర్ తిరిగి అదే చోట ధర్నా చేసేలా ఒత్తిడి తేగలిగారని ఉదహరి స్తూ ప్రజా పోరాటానికి ఎంతటి పాలకులైనా తలొం చక తప్పదని స్పష్టం చేశారు.
పదేండ్లుగా నియామకాల్లేకపోవటంతో ప్రభుత్వరంగ బ్యాంకులు అందించే సేవల్లో జాప్యం చోటు చేసుకుందని వివరించారు. ఈ విధంగా ప్రభుత్వ బ్యాంకులపై ప్రజా వ్యతిరేకత పెరిగేలా మోడీ సర్కారు కుట్ర చేసిందని విమర్శించారు.
అంతిమ నష్టం ప్రజలకే.....
ప్రయివేటీకరణతో అంతిమంగా ప్రజలే నష్టపోతారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు తెలిపారు. బ్యాంకు ఉద్యోగుల పోరాటానికి కార్మిక సంఘాల మద్ధతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజల ఆహార హక్కు, జీవించే హక్కు కోసం రైతులు పోరాడారనీ, అదే విధంగా ప్రజల ఆర్థిక హక్కు కోసం బ్యాంకు ఉద్యోగులు పోరాడుతున్నారని తెలిపారు. కష్టజీవులు ప్రభుత్వరంగ బ్యాంకులు ఉండాలని కోరుకుంటుంటే, కార్పొరేట్ వర్గాలు ప్రయివేటీకరణ కోసం ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలో బ్యాంకు ఉద్యోగులు ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సమ్మె మొదటి రోజు సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి కె.మానవతారారు, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు నాగయ్య, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకులు నాగేశ్వర్ రావు, తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటీటివ్స్ యూనియన్ నాయకులు నాగేశ్వర్ రావు, ఓయూ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.