Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో..
- మున్సిపల్ కార్మికుల 48 గంటల నిరసన
- రోడ్లపై వంటావార్పు, భోజనం
నవతెలంగాణ-విలేకరులు
ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెం. 60ని అనుసరించి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ మున్సి పల్ కార్మికులకు కేటగిరీల వారీగా కనీస వేతనాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మున్సి పల్ కార్మిక సంఘం (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీ యూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, తెలంగాణ ప్రగతిశీల మున్సి పల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర అధ్యక్షులు జి. రామయ్య డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచడంతో పాటు తదితర సమస్యలపై మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 48గంటల నిరసనలకు పిలుపునిచ్చారు. గురువారం ప్రధాన రహదారులపై వంటావార్పు నిర్వహించి రోడ్లపైనే భోజనాలు చేశారు. ఖమ్మం జిల్లా మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మం నగర పాలక సంస్థ కార్మికులు గురువారం విధులు బహిష్కరించారు. ధర్నా చౌక్‌లో 48 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. వంటావార్పు నిర్వహించి ప్రధాన రహదారిపై భోజనాలు చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న పాలడుగు భాస్కర్, మందా వెంకటేశ్వర్లు, జి. రామయ్య మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పే కమిషన్ అనేక మందితో చర్చించి అనేక విషయాలు పరిగణలోకి తీసుకొని తన సిఫార్సులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందన్నారు. పే కమిషన్ రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు గ్రూప్-4లో పనిచేస్తున్న వారికి రూ.19వేలు, గ్రూప్-3లో పనిచేస్తున్న వారికి రూ.22,900, గ్రూప్-3ఏలో పనిచేస్తున్న వారికి రూ.31వేలు సిఫార్సు చేసిందని తెలిపారు. పే కమిషన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ జీతాలతో పాటు సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ రూపంలో చెల్లించాలని కోరారు. పర్మినెంట్ కార్మికులతో సమానంగా సెలవులు, ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని చెప్పిందన్నారు. పే కమిషన్ సుప్రీం కోర్టు, హైకోర్టు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఇచ్చిన తీర్పులను కూడా పరిగణలోనికి తీసుకొని తన సిఫార్సులు ఇచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రకటించిన విధంగా మున్సిపల్ సిబ్బందికి జీతాలు పెంచి జూన్ నెల నుంచి ఎరియర్స్ చెల్లించాలనీ, లేదంటే జనవరి నెలలో నిరవధికంగా సమ్మె చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ ఖమ్మం జిల్లా అధ్యక్షకార్యదర్శులు తుమ్మా విష్ణువర్ధన్, కళ్యాణం వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి శింగు నర్సింహారావు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీ నారాయణ, యస్.కె.చానా, తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఖమర్ అలీ ఆధ్వర్యంలో వంటా వార్పు చేసి నిరసన తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు ఎదుట కార్మికులు దీక్ష చేపట్టారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం కార్యాలయ ఏఓకు వినతిపత్రం అందజేశారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు వచ్చిందని గొప్పగా చెప్పుకుంటున్నారనీ, కాని అందుకు శ్రమించిన కార్మికులకు పెంచిన వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో దీక్ష చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్‌లో వంటావార్పు నిర్వహించారు. మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల వంటావార్పు రేపు సాయంత్రం వరకు నిరవధికంగా కొనసాగుతుందన్నారు. బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఐఎఫ్టీయూ, సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
నల్లగొండ కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. వంటావార్పు చేసి నిరసన తెలిపారు. వీరికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మద్దతు తెలిపారు. యాదాద్రి కలెక్టరేట్ ఎదుట కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వంటావార్పు చేసి నిరసన తెలిపారు. సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. దేవరకొండ, మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు.