Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రం ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలానికి పూనుకున్న సందర్భంలో బీఎంఎస్ తన వైఖరిని ప్రకటించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మందా నరసింహారావు, ఉపాధ్యక్షులు బి.మధు శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 2015లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఎంఎస్పీ చట్టం ప్రకారం కమర్షియల్ మైనింగ్ పేరుతో బొగ్గు బ్లాకులను వేలం ద్వారా ప్రయివేటు వాళ్లకు కట్టబెడుతున్నదని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా బీఎంఎస్తో సహా అన్ని కార్మిక సంఘాల నాయకత్వంలో సింగరేణి కార్మికులందరూ మూడు రోజుల సమ్మె చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం అన్ని కార్మిక సంఘాలు కేంద్ర మంత్రిని కలవాలన్న నిర్ణయానికి భిన్నంగా బిఎంఎస్ నాయకత్వం ఒంటరిగా కేంద్ర బొగ్గు శాఖామంత్రిని కలిసిందని పేర్కొన్నారు. ఆ తర్వాత బీఎంఎస్తో సహా అన్ని కార్మిక సంఘాలు కలిసి వేలంలో సింగరేణి యాజమాన్యం పాల్గొనవద్దని ఒత్తిడి చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. సింగరేణి బ్లాకులను ప్రయివేటు వారికి అప్పజెప్పడం కోసమే సింగరేణి యాజమాన్యం వేలంలో పాల్గొనలేదని బీఎంఎస్ ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఒకపక్క సింగరేణిని వేలంలో పాల్గొనొద్దని చెప్పి మరోపక్క ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించడం బీఎంఎస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా సింగరేణి బ్లాకులను సింగరేణికి ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి చేసిన ప్రకటన బీఎంఎస్ నాయకత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బొగ్గు బ్లాకుల వేలంపై తన వైఖరిని బీఎంఎస్ స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.