Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిగిలిన సీట్లు కేవలం 417
- కాలేజీల్లో చేరేందుకు తుదిగడువు 20
- ఎంసెట్ బైపీసీ అభ్యర్థులకు తుదివిడత సీట్ల కేటాయింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరంలో బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ, ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 8,733 (95.44 శాతం) మందికి సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. ఎంసెట్ బైపీసీ అభ్యర్థులకు శుక్రవారం తుదివిడత కౌన్సెలింగ్లో సీట్లు కేటాయించామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ ఒక ప్రకటన విడుదల చేశారు. బీ ఫార్మసీ, ఫార్మా-డీ, ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ కోర్సులున్న 121 కాలేజీల్లో 9,150 సీట్లున్నాయని వివరించారు. వాటిలో 8,733 (95.44 శాతం) మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని తెలిపారు. కేవలం 417 సీట్లు మాత్రమే మిగిలాయని పేర్కొన్నారు. 118 బీఫార్మసీ కాలేజీల్లో 7,758 సీట్లుంటే, 7,359 (94.85 శాతం) మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని వివరించారు. 60 ఫార్మా-డీ కాలేజీల్లో 1,330 సీట్లకుగాను 1,312 (98.64 శాతం) మంది అభ్యర్థులకు సీట్లిచ్చామని తెలిపారు. ఒక ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్ కాలేజీలో 33 సీట్లుంటే వందశాతం, ఒక బయోటెక్నాలజీ కాలేజీలో 29 సీట్లుంటే వందశాతం సీట్లు భర్తీ అయ్యాయని వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్) కోటా కింద 466 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. సరిపోయినన్ని వెబ్ఆప్షన్లు నమోదు చేయకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 4,552 మందికి సీట్లు కేటాయించలేదని తెలిపారు.