Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మార్గదర్శకాల మేరకే....విమానాశ్రయంలో టెస్టులు
- ఒమిక్రాన్‌తో తీవ్రత తక్కువ...అయిన జాగ్రత్తలు తీసుకోవాలి :
డీహెచ్ డాక్టర్ జి.శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముప్పు ఉన్న దేశాల నుంచి వచ్చిన వారందరికి విమానాశ్రయాల్లోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నామనీ, కేంద్ర మార్గదర్శకాల మేరకు ఇతర దేశాల నుంచి వస్తున్న వారిలో రెండు శాతం మందికే టెస్టులు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్ లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసిందనీ, రాష్ట్రం వాటిని అమలు చేస్తున్నదని చెప్పారు.
ఇతర దేశాల నుంచి వస్తున్న వారిలో కేవలం రెండు శాతం మందికే టెస్టులు చేయాలన్న మార్గదర్శకాలను సవరించాలని ఇది వరకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్టు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కు సంబందించిన అనుభవాలు, అధ్యయనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఒక మరణం మాత్రమే నమోదయినట్టు తెలిపారు. 95 శాతం మందికి పైగా లక్షణాలు లేకుండా లేదా స్వల్ప లక్షణాలు మాత్రమే కలిగి ఉన్నారని చెప్పారు. అయితే వయస్సు మీద పడిన వారు, ఇతర వ్యాధులు కలిగిన వారిపై ఒమిక్రాన్ ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నదనే విషయంపై స్పష్టత రావడానికి మరో మూడు వారాలు పట్టే అవకాశముందన్నారు.