Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘటన
- నిజామాబాద్‌లో మరొకరు
నవతెలంగాణ -నల్లగొండ
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని మనస్తాపం చెందిన విద్యార్థిని రైలుకిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగింది. నల్లగొండ రైల్వే ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన వలిగొండ హరి జిల్లా కేంద్రం లోని మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తు న్నారు. ఆయనకు కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు జాహ్నవి(17) పట్టణంలోని గౌతమి కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. లాక్డౌన్ కారణంగా గతేడాది వాయిదాపడిన ఫస్టియర్ పరీక్షలను ఈ ఏడాది నిర్వహించగా.. గురువారం వెలువడిన ఫలితాల్లో జాహ్నవి పాస్ అయింది. కానీ, మార్కులు తక్కువగా వచ్చాయని మనస్తాపానికి గురైంది. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇంట్లో నుంచి వెళ్లి దగ్గర్లోని రైల్వే ట్రాక్‌పై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.
కుటుంబ సభ్యులు ఉదయం లేచే సరికే జాహ్నవి ఇంట్లో లేకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. రైల్వే ట్రాక్‌పై మృతదేహం కనిపించింది. రైల్వే స్టేషన్ మాస్టర్ సమాచారం మేరకు రైల్వే ఎస్హెచ్ఓ కోటేశ్వరరావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి: విద్యార్థి సంఘాల డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత, ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డీఐఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. జాహ్నవి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను ప్రమోట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సుకుమార్, కోరే రమేష్, యువరాజు రావన్, సిద్ధార్థ్, రమేష్, నాగరాజు, నరేష్, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇందూరు సాగర్ తదితరులు పాల్గొన్నారు. కాగా నిజామాబాద్‌లో మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.