Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మున్సిపల్ కార్మికులను దేవుళ్లని పొగుడుతూ వెట్టిచాకిరీ చేయించుకోవడం ఎంత వరకు సమంజసమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు కొత్త వేతనాలు చెల్లించాలనీ, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని గురు, శుక్రవారాల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నా, వంటావార్పు కార్యక్రమాలు చేపట్టారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాల్టీల్లో సుమారు 64 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని వివరించారు. వారికి వేతనాలు దారుణంగా చెల్లిస్తున్నారని విమర్శించారు. కేటగిరీల వారీగా రూ.19 వేల నుంచి రూ.31,040 వేతనం చెల్లించాల్సి ఉన్నా రూ.15,600 నుంచి రూ.22,750 చెల్లిస్తూ జీవో నెంబర్ 60ని జారీ చేసిందని తెలిపారు. జీహెచ్ఎంసీ కార్మికులకు ప్రస్తుతం ఇచ్చే వేతనంపై 30 శాతం పెంచి ఇవ్వాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలనీ, ఆరోగ్యకార్డులు ఇవ్వాలని సూచించారు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. 'మున్సిపల్ కార్మికులు దేవుళ్లలాంటి వారు. కరోనా సమయంలో ప్రాణాలను లెక్కచేయకుండా పారిశుధ్య పనులు చేశారు. ప్రజల ఆరోగ్యాలను కాపాడారంటూ సీఎం కేసీఆర్ అన్నారు'అని పేర్కొన్నారు. వారణాసిలో ప్రధాని మోడీ మున్సిపల్ కార్మికుల కాళ్లు కడిగారని గుర్తు చేశారు. మాటలతో సంతోషపెట్టి వారి పొట్ట కొట్టి వెట్టిచాకిరీ చేయించు కుంటున్నారని విమర్శించారు. వారి ఆరోగ్యాన్ని, ప్రాణాలను లెక్కచేయకుండా పారిశుధ్య పనులు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనీ, కష్టాలపాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారిని కార్మికులుగా ప్రభుత్వం గుర్తించడం లేదని తెలిపారు. తెలంగాణ వస్తే పర్మినెంట్ అవుతారనీ, వేతనాలు పెరుగుతాయని ఉద్యమ సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారని వివరించారు. వారి సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతారని హెచ్చరించారు. మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని కోరారు.