Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూ నిర్వాసితులకు మద్దతుగా పాదయాత్ర : బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేట్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ - బల్మూరు
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీఎస్పీదే రాజ్యధికారమని ఆ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేట్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. భూ నిర్వాసితులకు మద్దతుగా ఈనెల 14న చేపట్టిన పాదయాత్ర శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లాలోని బల్మూరు, లింగాల మండలాల్లోని గోదల్ గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఎలాంటి పరిహారమూ ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. దశాబ్దాలుగా పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునే రైతుల పట్ల అటవీ అధికారులు కర్కశంగా ప్రవరిస్తూ పంటలను ధ్వంసం చేయడం సరికాదన్నారు. ఈ సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. డిండి ప్రాజెక్టులో భూమిని కోల్పోయిన స్థలంలో టెంట్ వేసుకుని తాత్కాలికంగా నివాసముంటూ, న్యాయం కోసం పోరాటం చేస్తున్న తుమ్మల ప్రగతి కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే పోలీసుల సహాయంతో బెదిరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా నిర్వాసితులను బెదిరింపులకు గురి చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేయడం లేదని, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిరుద్యోగులు ప్రాణం తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అమ్రాబాద్, పదర వంటి అటవీ ప్రాంత మండలాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా లేక ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు.