Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళారులను నమ్మొద్దు
- బన్సిలాల్‌పేట్ ఇండ్ల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ- సిటీబ్యూరో
పేదల ఆత్మగౌరవానికి ప్రతీక డబుల్ బెడ్ రూమ్ ఇండ్లని, ఇండ్ల కోసం దళారులను నమ్మి మోసపోవద్దని పురపాలక పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. హైదరాబాద్ సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సిలాల్‌పేట్ డివిజన్ చాచానెహ్రూనగర్ (సీసీనగర్)లో రూ.19.22కోట్లతో నిర్మించిన 258 రెండు పడకల గదుల ఇండ్లను శుక్రవారం హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ వాణిదేవితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. తెలంగాణ రాకముందు సరిగ్గా బియ్యం వచ్చేవి కావని, ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఇక్కడ గహ నిర్మాణానికి పెట్టిన ఖర్చు మిగతా 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేదని, రాష్ట్రంలో రూ.18వేల కోట్ల భారీ బడ్జెట్‌తో పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.11వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తిచేసి పేదలందరికీ అందిస్తామని తెలిపారు. ఇక్కడ నిర్మించిన ఇండ్లకు మార్కెట్ విలువ రూ.40 లక్షల నుంచి 50లక్షల వరకు ఉంటుందన్నారు. దళారులను, పైరవీలకు అవకాశమే లేదని, ఇక్కడ ఉన్న వారికి న్యాయం జరుగుతుందని చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పేదలు గొప్పగా బతకాలని, ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇండ్లను నిర్మించి ఇవ్వడం దేశంలో మరెక్కడా లేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లను ఉచితంగా అందిస్తున్నామని, ఇక్కడ బస్తీలో ఉన్నవారికే న్యాయం జరుగుతుందని, ఇక్కడి ఎక్కడికైనా వెళ్లినా వాళ్ల కోసం వారం రోజుల్లో ఇండ్ల కేటాయింపు జరుపుతామని, అప్పటి వరకు ఓపికతో ఉండాలన్నారు. ఈ గృహాలను కొనడం, అమ్మడం జరుగదని, తమ పిల్లలు తరతరాలుగా ఉపయోగించుకోవాలని సూచించారు.
హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రోడ్లు, భవనాల శాక మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. ఇక్కడ ఇండ్లు పొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలతశోభన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్.లోకేష్‌కుమార్, జిల్లా కలెక్టర్ యల్.శర్మన్, హౌసింగ్ చీఫ్ ఇంజినీర్ కన్నా సురేష్‌కుమార్, కార్పొరేటర్ హేమలత లక్ష్మిపతి, ఆర్డీవో తదితరులు పాల్గొన్నారు.